గన్నవరం ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద మందుబాబుల వీరంగం
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్ ముందు మందు బాబులు వీరంగం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి భర్తడే పార్టీ అంటూ కొంతమంది యువకులు ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద హల్చల్ చేశారు. మందు కొడుతూ, చిందులు వేస్తూ, బాణా సంచా కాల్చి అలజడి సృష్టించారు. కానీ, అటు గన్నవరం పోలీసులు గాని, ఇటు ఎయిపోర్ట్ సెక్యూరిటీ గాని కిమ్మనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అంతమంది యువకులు మందుకొట్టి స్వైర విహారం చేస్తుంటే, కనీసం సెక్యూరిటీ సిబ్బందిలో ఉలుకుపలుకు లేదు. తమకేం పట్టనట్లు వ్యవహరించారు. రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు మందుబాబులు ఎయిర్పోర్ట్ ముందు బాణసంచా కాలుస్తూ, మద్యం సేవిస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ గందరగోళం సృష్టించినా ఎయిర్‌పోర్ట్ భధ్రతా సిబ్బందిగాని పోలీసులు గాని ఎవరు తమకేమి పట్టనట్లు వ్యవహరించారు.
ఇపుడు నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. కొత్త రాజధాని అమరావతికి సింగపూర్, జపాన్, మలేసియా వంటి దేశాల నుంచి ప్రతినిధులు ఈ గన్నవరం ఎయిర్‌పోర్ట్ ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఎవరైనా ఎయిర్‌పోర్ట్ లోకి వస్తే 100 ప్రశ్నలు ఐడి కార్డులు చూపాలంటూ... ఎయిర్‌పోర్ట సిబ్బంది వేధిస్తుంటారు. కానీ ప్రధాన ద్వారం వద్ద ఇంత జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. ఇకనైనా అలాంటిచోట ఇలాంటి గందరగోళాలను అరికట్టాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.