శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (13:19 IST)

ఈవీఎం ధ్వంసం : వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు ఈసీ ఆదేశం

pinnelli ramakrishna reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన అధికార వైకాపా మాచర్ల  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాచర్లలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాంత్మక సంఘటనల తర్వాత పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. 
 
ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5 గంటల లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీచేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ పెట్టిన ట్వీట్‌ను ఈసీ ప్రస్తావించింది. 
 
మరోవైపు, మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తో పాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈసీ.. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.