శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (17:39 IST)

వసూలు చేసిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు తిరిగి వినియోగదారులకు!

విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల‌పై ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న విద్యుత్ పై 3699 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) గతంలో అనుమతి ఇచ్చింది. కానీ, న్యాయపరమైన వివాదాలు, ఇతర కారణాలతో ఆ ఆదేశాలను మండలి రద్దు చేసింది. 
 
 
ఆదేశాలు రద్దు చేసినందున ట్రూ అప్ ఛార్జీల వసూళ్లను నిలిపివేయాలని, ఇప్పటికే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని మండలి జరిపిన ఆన్లైన్ విచారణలో కోరామ‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. బాబూరావు చెప్పారు. సిపిఎం మరియు వివిధ సంస్థలు, ప్రజలు ఒత్తిడి మేరకు నియంత్రణ మండలి వసూలు చేసిన చార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించింద‌న్నారు. ఈ విషయాన్ని విద్యుత్ నియంత్రణ మండలి కార్యదర్శి లేఖ ద్వారా సిపిఎం రాష్ట్ర కమిటీకి తెలియజేశారు.
 
 
వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వినియోగదారులకు తదుపరి బిల్లులో తగ్గించి ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి అంగీకరించింది. అయితే 2014 -19 సంబంధించిన 3699 కోట్ల రూపాయలు, 2019 -20 సంవత్సరానికి సంబంధించి 2542 కోట్ల రూపాయలు, ట్రాన్స్కో ట్రూ అప్ చార్జీల పేరుతో మరో 500 కోట్ల రూపాయలు భారం మోపే ప్రతిపాదనలపై నియంత్రణ మండలి ఆన్లైన్ విచారణ జరిపింది.
 
 
ప్రజల విజ్ఞప్తి మేరకు నియంత్రణ మండలి ఈ ప్రతిపాదనలను తిరస్కరించాల‌ని, తిరిగి చార్జీలు భారం మోపే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాల‌న్నారు. విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయలు ఆదా చేసామని చెబుతున్న ప్రభుత్వం ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ చేసి విద్యుత్ చార్జీలను కూడా తగ్గించాల‌న్నారు. భవిష్యత్తులో విద్యుత్ భారాలు మోపితే ప్రజల ప్రతిఘటన తప్పదని సీపీఎం నాయ‌కులు హెచ్చరించారు.