మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (08:04 IST)

నవయుగ వ్యాజ్యంపై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అర్ధాంతరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
 
 కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్టు 14న ఏపీ జెన్‌కో (హైడల్‌ ప్రాజెక్ట్స్‌) చీఫ్‌ ఇంజినీర్‌ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని నవయుగ డైరెక్టర్‌ వై.రమేశ్‌ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఇరువర్గాల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. 
 
పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు స్థలం చూపించాల్సిన బాధ్యత ఏపీ జెన్‌కోపై ఉందని.. స్థలం చూపించకపోవడం వలనే నిర్మాణం చేపట్టలేకపోయామని నవయుగ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. ఏపీ జెన్‌కోతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించలేదని కోర్టుకు తెలిపారు.
 
 2021 నవంబరు 20 వరకు తమకు కాంట్రాక్టు గడువు ఉందని వివరించారు. కాంట్రాక్టు రద్దు చేస్తూ ఈ ఏడాది ఆగష్టు 14న ఏపీ జెన్‌కో ఛీఫ్‌ ఇంజినీర్‌ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. ప్రాజెక్టు నిర్మాణంలో తమనే కొనసాగించాలని.. రివర్స్‌ టెండరింగ్‌ను నిలిపివేసేందుకు ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. 
 
మరోవైపు ప్రభుత్వం తరుఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదని కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.