దడ పుట్టిస్తున్న వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్... ఇందులో మీకు ఎంత తెలుసు?

whatsapp
ఎం| Last Updated: ఆదివారం, 10 జనవరి 2021 (09:43 IST)
దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది? ఎందుకంత చర్చ జరుగుతోంది? అందులో పుట్టిస్తున్న అంశాలేంటీ? తెలుసుకోండి.

1. ఉదయాన్నే వాట్సప్ ఓపెన్ చేయగానే మీకు కొత్త ప్రైవసీ రూల్స్ పాప్ అప్ మెసేజ్ కనిపించిందా? అవి చదవకుండా యాక్సెప్ట్ చేసేశారా? దాని వల్ల మీ ప్రైవసీకి కలిగే భంగం ఏంటో తెలుసా? ఆ విషయాలు తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేస్తే మీరు చిక్కుల్లో పడ్డట్టే.

2. మీ డేటాను వాట్సప్ ఎలా ఉపయోగించుకోబోతుందో, మీ డేటాను ఫేస్‌బుక్‌కు ఎలా షేర్ చేసుకుంటుందో, దీంతో పాటు మీ వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్‌లో వివరంగా ఉన్నాయి.

3. అసలు వాట్సప్ అంటే ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్న పేరు ఉంది. అందుకే ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం మరో కారణం.

4. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే మీరు పంపిన మెసేజ్ అవతలివారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదు. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నందుకే వాట్సప్ యూజర్ల సంఖ్య పెరిగింది.

5. కానీ ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మీరు వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే మీరు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి.

6. అంతేకాదు... మీరు వాట్సప్‌లో పంపే మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. అంటే మీ అభిరుచులు ఏంటీ, మీరు ఎక్కువగా ఏ టాపిక్స్‌పై ఆసక్తి చూపిస్తారు, ఎక్కువగా వేటి గురించి మాట్లాడతారు అన్న విషయాలు వాట్సప్‌కు తెలుస్తాయి.

7. ఇలా మీ అభిరుచులు, ఆసక్తులు వాట్సప్‌కు తెలియడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటన్న సందేహం ఉందా? ఈ డేటా మొత్తాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది వాట్సప్. ఒకప్పుడు వాట్సప్ ఇండిపెండెంట్ సంస్థ. కానీ ఇప్పుడు వాట్సప్ ఫేస్‌బుక్‌కు చెందిన సంస్థ.

8. మీ అభిరుచులు, ఆసక్తులు ఫేస్‌బుక్‌కి తెలియడం వల్ల మీరు ఏవి ఇష్టపడతారో అందుకు సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్‌పైన ఎక్కువగా కనిపిస్తాయి. దీని ద్వారా మీకు ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ల ట్రాప్‌లో పడే అవకాశం ఉంది.

9. ఇటీవల వాట్సప్ పేమెంట్స్ మొదలైన సంగతి తెలిసిందే. అందులో మీరు చేసే లావాదేవీల వివరాలను కూడా ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది వాట్సప్. మీ ఫోన్ నెంబర్లు కూడా ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది.

10. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానుంది. అంటే మీరు అంతలోపు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలి. ఈ రూల్స్ అంగీకరించకపోతే మీరు వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదు.దీనిపై మరింత చదవండి :