శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 మే 2020 (19:44 IST)

గదిలో పడేసి బెల్టుతో బాదడం తెలుసు: కేంద్రమంత్రి వార్నింగ్

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ మరోమారు వార్తల్లో కెక్కారు. బెల్టుతో బాదడం తనకు కొత్తేమీ కాదంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

చత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ జిల్లా దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు బాగా లేవని ఫిర్యాదు చేశాడు. తాను ఫిర్యాదు చేశానన్న కోపంతో క్వారంటైన్ కేంద్రం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తహసీల్దార్ తనపై దాడి చేశారని దిలీప్ గుప్తా ఆరోపించాడు.
 
దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర సహాయమంత్రి రేణుకా సింగ్ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. జరిగిన ఘటనపై దిలీప్ గుప్తా, అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి అధికారులపై మండిపడ్డారు. కాషాయం ధరించిన బీజేపీ కార్యకర్తలను బలహీనులుగా భావించవద్దని స్పష్టం చేశారు.

గదిలో పడేసి బెల్టుతో బాదడం ఎలాగో నాకు బాగా తెలుసు అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ కార్యకర్తల పట్ల మీరు చూపిస్తున్న వివక్షను విడనాడండి అంటూ గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.