మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (14:12 IST)

ఢిల్లీ టూ బెంగుళూరు... ఒంటరిగా జర్నీ చేసిన ఐదేళ్ళ బుడ్డోడు

లాక్డౌన్ కారణంగా ఐదేళ్ళ బుడ్డోడు ఢిల్లీలో చిక్కుకునిపోయాడు. ఆ బుడ్డోడి తల్లిదండ్రులు మాత్రం బెంగుళూరులో ఉంటున్నారు. అయితే, ఢిల్లీలోని తమ బంధువుల ఇంటికి వెళ్లిన ఐదేళ్ళ చిన్నోడు.. తిరిగి వచ్చే సమయంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో మూడు నెలలుగా ఢిల్లీలో ఉండిపోయాడు. 
 
అయితే, లాక్డౌన్ ఆంక్షలు సడలించడం, విమానం సర్వీసులు పునరుద్ధరించడంతో తమ బిడ్డను ఢిల్లీ నుంచి బెంగుళూరుకు రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వచ్చిన విమానంలో ఐదేళ్ళ బుడ్డోడు కుటుంబ సభ్యులు లేకుండానే ఒంటరిగా వచ్చాడు. ఈ విమానంలో ప్రయాణించినవారంతా ఆ బాలుడిని ఆశ్చర్యంగా చూడసాగారు. 
 
ఇంతకీ ఆ బుడ్డోడి పేరు ఏంటో తెలుసా.. విహాన్ శర్మ. వయసు ఐదేళ్లు. సోమవారం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వచ్చిన విమానంలో ఈ విహాన్ శర్మ కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ తల్లి రిసీవ్ చేసుకుంది. అయితే, అధికారుల ఆదేశం మేరకు ఆ చిన్నోడికి హోం క్వారంటైన్‌కు తరలించారు. 
 
కాగా, ఈ బాలుడిని స్పెషల్ కేటగిరీ ప్యాసింజర్‌గా విమాన సిబ్బంది గుర్తించి, సురక్షితంగా బెంగుళూరుకు తీసుకొచ్చారు. ప్రయాణ సమయంలో ఈ బుడ్డోడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి, చేతిలో మొబైల్ ఫోను పట్టుకుని వచ్చాడు.

ఢిల్లీలో అతని బంధువులు విమానం ఎక్కించగా, బెంగుళూరులో ఆ బాలుడి తల్లి రిసీవ్ చేసుకుంది. కాగ, ఇంత చిన్న వయసులోనే ఢిల్లీ నుంచి బెంగుళూరుకు ఒంటరిగా ప్రయాణించిన బుడ్డోడిగా విహాన్ శర్మ చరిత్ర సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.