శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:39 IST)

ఏపీ విద్యుత్ శాఖలో 398 పోస్టుల భర్తీకి స‌న్నాహాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నియామ‌కాలు జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ‌దులుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో ఎనర్జీ అసిస్టెంట్‌ (జూనియన్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి "https://www.apeasternpower.com/' ఏపీఈపీడీసీఎల్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019లో భర్తీ చేయగా, మిగిలిన 398 పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తోంది.

ఎలక్ట్రికల్, వైరింగ్‌ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయెన్సెస్‌ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ కోర్సు చేసిన పురుష అభ్యర్థులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాతపరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైనవారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్‌ టెస్ట్‌)కు పిలుస్తారు.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 24
► రాత పరీక్ష: అక్టోబర్‌ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు)
► రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్‌ 22
► ఫిజికల్‌ టెస్ట్‌ (విద్యుత్‌ స్తంభం ఎక్కడం, మీటర్‌ రీడింగ్‌ చూడటం, సైకిల్‌ తొక్కడం): నవంబర్‌ 1 – 6
► ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్‌ 15
► నియామక పత్రాలు అందజేత: నవంబర్‌ 17
► పత్రాలు అందుకున్నవారు ఏఈలకు రిపోర్ట్‌ చేయాల్సింది: నవంబర్‌ 29
► ఓరియెంటేషన్‌ కార్యక్రమం: నవంబర్‌ 30 – డిసెంబర్‌ 1 వరకు
► గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్‌ చేసి విధుల్లో చేరిక: డిసెంబర్‌ 2