మంగళవారం, 6 డిశెంబరు 2022
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:52 IST)

రేణిగుంటలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు మృతి

rtcbus catch fire
తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ రవిశంకర్ రెడ్డి మంటల్లో సజీవదహనమయ్యాడు. ఇద్దరు పిల్లలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, అత్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇదే ఆస్పత్రి భవనంపైన రవిశంకర్ రెడ్డి కుటుంబం నివసిస్తుంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రవిశంకర్ రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపు చేసి అతి కష్టంమీద రవశంకర్ రెడ్డి 12 యేళ్ల కుమారుడు, భరత్, కుమార్తె కార్తీక (15)ను రక్షించారు. 
 
వీరందరినీ తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ కన్నుమూశారు. రవిశంకర్ రెడ్డి మంటల్లోలే కాలిబూడిదైపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.