దసరా 2024 : ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్.. ఆహారం, నీటి నాణ్యతను..?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా ఉత్సవాల సందర్భంగా "ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్" అనే మొబైల్ ల్యాబ్‌ను ప్రవేశపెట్టింది.
గురువారం ప్రారంభించిన ఈ కార్యక్రమం నగరంలో తక్షణ ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ మొబైల్ ల్యాబ్ నగరంలోని వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో జనాలు, అనేక తినుబండారాలు ఉన్న ప్రాంతాలు, ఆహార పదార్థాలు, నీటి నాణ్యతను పరీక్షించడానికి ఇవి పనిచేస్తాయి.
ఇంకా కనకదుర్గ ఆలయంలో అందించే ఆహార పదార్థాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు కూడా ఈ మొబైల్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. సాధారణ ప్రజలు తమ ఇళ్ల నుండి ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి మొబైల్ ఫుడ్ ల్యాబ్ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ జాయింట్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన కేంద్రాల్లో ఉన్న తినుబండారాల్లో ఆహారం, నీటి నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ప్రారంభించామని, దీని సేవలను ప్రజలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు.