శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (18:04 IST)

కొవ్వూరు మునిసిప‌ల్ వైస్ ఛైర్మన్‌గా గండ్రోతు అంజ‌లీ దేవి

కొవ్వూరు మునిసిపాలిటీ రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియను కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి నిర్వహించారు. స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి వైస్ ఛైర్మ‌న్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

కొవ్వూరు మున్సిపాలిటీ సమావేశమందిరంలో కొవ్వూరు మున్సిపల్  వైస్ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. కొవ్వూరు కౌన్సిలర్లు 23 మందికి గాను ఒకరు మరణించిన కారణంగా మిగిలిన 22 మంది సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించి పార్టీ నుంచి ఫారం ఏ, బిను గండ్రోతు అంజలిదేవి పేరుపై జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య జారీ చేసినట్లు ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి తెలిపారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి పేరుని 21వ వార్డు కౌన్సిలర్ సఖినేటిపల్లి చాందిని ప్రతిపాదించగా, 14 వ వార్డ్ కౌన్సిలర్ చీర్ల అరుణ బలపరిచారు.

సభ్యుల ఆమోదంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి గండ్రోతు అంజలిదేవి కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలతో పాటు, మునిసిపల్ ఛైర్ పర్సన్ భావన రత్న కుమారిలు నూతనంగా ఎన్నికైన వైస్ ఛైర్‌పర్సన్ గండ్రోతు అంజలిదేవిని అభినందించారు.