కొవ్వూరి సురేష్ రెడ్డి... యానిమేషన్ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే. అంతేకాదు... ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇటీవల 30 ఏళ్ళ లోపు వయసుగల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో చోటుదక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్ రెడ్డి. గత 13 ఏళ్ళుగా క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఉన్నారు.
ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి సురేష్ రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. పి19 ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు.
పి19 ఎంటర్టైన్మెంట్లో ప్రొడక్షన్ నెం1గా రూపొందనున్న చిత్రానికి సూపర్‌స్టార్ కిడ్నాప్, పేపర్ బోయ్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఛోరి, మరోజన్మ, ప్యూర్ సోల్ వంటి అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన ఆకాష్ రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
పి19 ఎంటర్టైన్మెంట్లో ప్రొడక్షన్ నెం2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా ఋషికిగాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కె ఫిల్మ్ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ఋషి చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఆంధ్రాపోరి, ఐతే 2.0 చిత్రాలకు రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు.
పి19 ఎంటర్టైన్మెంట్లో ప్రొడక్షన్ నెం3గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు పెళ్ళి గోల వెబ్‌సిరీస్, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన 47 డేస్ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దీనికి రమేష్ ప్రసాద్ సమర్పకులు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మూడు చిత్రాలను ప్రకటించారు. మూడు చిత్రాల ప్రీలుక్స్, లోగోలను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసాద్స్ గ్రూప్ ఛైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ప్రముఖ ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామి రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాత రాజ్ కందుకూరి, జీ5లో హెడ్ క్రియేటివ్ అండ్ కంటెంట్ యాక్వేషన్ నిమ్మకాయల ప్రసాద్, దర్శకులు రాజ్ మాదిరాజు, ప్రదీప్ మద్దాలి, ఆకాష్‌రెడ్డి, పీ19 ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత కొవ్వూరి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సినిమా లోగోలు ఆవిష్కరించిన అనంతరం రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా నాన్న ఎల్వీ ప్రసాద్‌గారే. ఆయన సంపాదించినదంతా సినిమాల్లోనే పెట్టారు. మాకు హైదరాబాద్, చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ముంబై, కలకత్తాలో ఆఫీసులు ఉన్నాయి. నా జీవితమంతా సినిమాతో ముడిపడి ఉంది. మేం ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో కొన్ని సినిమాలు నిర్మించాం. ఇంకా నిర్మిస్తాం. మేం చిత్ర నిర్మాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ రోజు మూడు చిత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ కొవిడ్‌లో ప్రపంచం మొత్తం షేక్ అవుతుందే... మా రమేష్ ప్రసాద్ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనర్జీగా 84 ఏళ్ళ వయసులో మూడు సినిమాల ప్రొడక్షన్ మొదలుపెట్టడం మామూలు విషయం కాదు. ఎల్వీ ప్రసాద్ సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. చివరి శ్వాస వరకూ సినిమాతో ఉంటాయనని ఆయన చెప్పారు.
ఎల్వీ ప్రసాద్ వాళ్ళకు ఇచ్చిన ఆస్తి అదే. ఇవాళ కొత్త వాళ్ళతో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్ మాదిరాజు, ప్రదీప్, ఆకాష్‌ను దర్శకులుగా పెట్టుకుని మూడు సినిమాలు మొదలుపెట్టారు. ఈ రోజు సినిమా అనేది చాలా మారిపోయింది. సినిమా బావుంటే ప్రేక్షకులు సెల్ ఫోనుల్లో కూడా చూసి ఆదరిస్తున్నారు. మీరు చేసే ఈ ప్రయత్నం సక్సెస్‌ఫుల్ కావాలని ఆశిస్తున్నా అని అన్నారు.
కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, మా నాన్నగారికి రమేష్ ప్రసాద్ క్లోజ్ ఫ్రెండ్. నేను సినిమాల్లోకి వస్తానంటే రావొద్దని చెప్పిన తొలి వ్యక్తి ఆయనే. వచ్చిన తర్వాత ఎంకరేజ్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. ఇవాళ్టి రోజున కొత్తవాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడమనేది ఎంత కష్టమైన పనో, ఎంత రిస్క్‌తో కూడుకున్నదో అందరికీ తెలిసిందే. ఎందుకంటే... పదేళ్ళుగా నేను చేస్తున్నది అదే.
సురేష్‌లాంటి కొత్త నిర్మాతకు రమేష్ ప్రసాద్ వంటి బ్యాకింగ్ రావడం మంచి విషయం. సురేష్‌గారు ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇండస్ట్రీకి ఫైనాన్షియల్ డిసిప్లెన్ అవసరం. ఆయన లాంటి వాళ్ళు, ఎన్నారైలు రావడం వలన ఆ డిసిప్లెన్ వస్తోంది. దర్శకులు అందరికీ ఆల్ ది బెస్ట్. రాజ్ మాదిరాజు చాలా రోజులుగా తెలుసు. అతడిని యాక్టింగ్ చేయమని చెప్పాను. యాక్టర్‌గా చాలా ఆఫర్లు వస్తున్న టైమ్‌లో మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నాడు అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ, రమేష్ ప్రసాద్ నేను వెనుక ఉంటాను. మీరు నడిపించండి అని చెప్పడం ధైర్యంగా ఉంది. మూడు సినిమాలను ఒకేసారి ప్రకటించిన సురేష్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నా. కమర్షియల్ సక్సెస్ ఒకటే సినిమాకి కొలమానం కాదని నేను చెబుతున్నా. ఋషి చూస్తే రాజ్ మాదిరాజు టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ప్రదీప్, ఆకాష్ మంచి అభిరుచి కల దర్శకులు. వాళ్ళు ముగ్గురికీ ఆల్ ది బెస్ట్. ముగ్గురు మంచి దర్శకులను సురేష్‌రెడ్డి ఎంపిక చేసుకున్నారు. మంచి సినిమాలు బయటకు వస్తాయని గట్టిగా నమ్ముతున్నా అని అన్నారు.
నిమ్మకాయల ప్రసాద్ మాట్లాడుతూ రమేష్ ప్రసాద్ బ్లెస్సింగ్స్ ఇదేవిధంగా ఉండాలని ఆశిస్తున్నా. ఆయన కొత్తవాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సురేష్‌రెడ్డి ఇదేవిధంగా సినిమాలు తీయాలని కోరుకుంటూ ముగ్గురు దర్శకులకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
డాక్టర్ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ, రమేష్ ప్రసాద్‌గారి బ్లెస్సింగ్స్‌తో సురేష్ రెడ్డికి సక్సెస్ మొదలైంది. రమేష్ ప్రసాద్‌గారితో స్టేజి షేర్ చేసుకోవడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా. సురేష్ నాకు కజిన్ అవుతారు. అతనికి, టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు.
దర్శకుడు ఆకాష్‌రెడ్డి మాట్లాడుతూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్యూ సో మచ్. సురేష్ కొవ్వూరిగారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం హ్యాపీగా ఉంది. అని అన్నారు.
దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ, అక్టోబర్ 2010... పదేళ్ళ క్రితం రమేష్‌ని కలవడానికి ప్రసాద్ ల్యాబ్స్‌కి వచ్చాను. ఈ క్యాంపస్‌తో నాకు పదేళ్ళ అనుబంధం ఉంది. సచిన్ టెండూల్కర్‌కి వాంఖడే స్టేడియంలా నాకిది హోమ్ పిచ్. నన్ను ముసలోడు అని దామోదర ప్రసాద్ అన్నారు. కానీ, నా ఆలోచనలు యంగ్‌గానే ఉన్నాయి. నా సినిమాకి సురేష్‌తో పాటు రవికాంత్ జామి నిర్మాత. ఆయన ఎన్నారై.
తను హార్వర్డ్‌లో చదువుకున్న వ్యక్తి. ప్రసాద్ ల్యాబ్స్‌లో హార్వర్డ్, ఫోర్బ్స్ కలిశాయి అని సరదాగా చెప్పాను. సినిమాలు తీయడానికి మంచి వ్యక్తులు వస్తున్నారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప సినిమాలు, న్యూ ఏజ్ సినిమాలు తీయడానికి వీరంతా వస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో మిస్టరీ అనేది ఉంటుంది. ఒకటి మిస్టీ అండ్ మిస్టీరియస్... రెండోది డస్టీ అండ్ మిస్టీరియస్... మూడోది సెక్సీ అండ్ మిస్టీరియస్ అని అన్నారు.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన గెస్ట్‌లు అందరికీ థ్యాంక్యూ. మా పేరెంట్స్‌కి థ్యాంక్యూ. నా బాస్, గురు పూరి జగన్నాథ్‌కి థ్యాంక్యూ సోమచ్. పి19 ఎంటర్‌టైన్‌మెంట్ సురేష్‌తో రెండేళ్ళ నుంచి కథలపై డిస్కస్ చేస్తున్నా. లాస్ట్ వీక్ కాల్ చేసి సినిమా అనౌన్స్ చేస్తున్నామని చెప్పగానే సర్‌ప్రైజ్ అయ్యాను. అవకాశం ఇచ్చిన ఆయనకు థ్యాంక్యూ అని అన్నారు.
సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ, బ్లెస్సింగ్స్ అందించిన రమేష్ ప్రసాద్‌కి థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మేం రెండేళ్ళ నుండి ఎన్నో కథలు విన్నాం. మాకు స్టోరీలు నేరేట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. వరల్డ్ సినిమాకి తెలుగు సినిమా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఎంతోమంది యంగ్ ట్యాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు. నేను కంటెంట్ ఈజ్ ది ఫిల్మ్ (కింగ్) అనేది నమ్ముతాను. వచ్చే నాలుగేళ్ళల్లో 20 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ మూడు సినిమాల విషయానికి వస్తే... మా దర్శకులు ముగ్గురూ ఆల్రెడీ తమ కథలతో ఇంతకు ముందే ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ కథలపై నమ్మకంతో సినిమాలు ప్రారంభించాం.
ప్రదీప్ మద్దాలి సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న మొదలుపెట్టి, మార్చి 15కి పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. రాజ్ మాదిరాజు సినిమా చిత్రీకరణ ఈ ఏడాది డిసెంబర్ 22న మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి పూర్తవుతుంది. ఆ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆకాష్ రెడ్డి సినిమా చిత్రీకరణ నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు.