1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (21:44 IST)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆవిధంగా జరిగింది

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని చెప్పారు.

రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఢిల్లీ పర్యటనల్లో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకునేవారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరిగాయి. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై ఎల్లో మీడియా హడావుడి చేసింది.
 
హోంమంత్రి అపాయింట్‌మెంట్ వాయిదా పడితే అది తప్పా?. రాష్ట్ర ప్రయోజనాలకే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పనులు ముందుకు సాగలేదు. కరోనా సమయంలో కూడా పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయం. సీఎం జగన్‌ విజన్‌తో తీసుకున్న నిర్ణయం అమలవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణపై కేంద్ర సాయం కూడా ఉంటుంది’’ అని అన్నారు.