పర్మిట్లు లేకుండానే పచ్చజెండా...! మూడు బస్సులు సీజ్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో కొందరు రాష్ట్రానికి చెల్లించవలసిన పన్నులను చెల్లించకుండా ఇతర రాష్ట్రాలకు బస్సులను తిప్పడానికి ప్రయత్నిస్తున్నారని అటువంటి వాహనాలు మా దృష్టికి వస్తే వదిలిపెట్టేది లేదని డిటీసీ యం.పురేంద్ర హెచ్చరించారు.
డిటిసి పురేంద్ర మాట్లాడుతూ ఆదివారం అర్థరాత్రి నాడు గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు సోదాలలో సరైన పర్మిట్లు లేకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మూడింటిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేరే బస్సులో హైదరాబాద్ కు పంపించడం జరిగిందని అన్నారు. రెండు బస్సులు విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్నాయని, ఇంకొకటి హైద్రాబాద్ నుండి భీమవరంకు వెళ్తున్నాయని ఆయన తెలిపారు.
గరికపాడు చెక్పోస్ట్ వద్ద రెండు బస్సులను, భీమవరం ఆర్టీసీ డిపో వద్ద ఒక బస్సును సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈమూడు బస్సులు జిల్లా పర్మిట్లు తీసుకుని ఇతర రాష్ట్రాలకు నడుపుతున్నారని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిప్పుకోవాలంటే అల్ ఆలిండియా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని, లేదా టెంపరరీ పర్మిట్ తీసుకొని నడపాలన్నారు.
ఆల్ ఇండియా పర్మిట్ కలిగిన బస్సులకు సీటుకు రూ.3750 చొప్పున టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా పర్మిట్ కు సంబంధించిన టాక్స్ రూ.1000 మాత్రమే చెల్లించి బస్సులను ఇతర రాష్ట్రాలకు తిప్పడం జరిగిందని ఆయన తెలిపారు. టాక్స్ లు చెల్లించకుండా, సరైన పర్మిట్లు తీసుకోకుండా బస్సులను నడిపి చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే అటువంటి బస్సులను ఉపేక్షించేదేలేదని డిటిసి హెచ్చరించారు.
కరోనా నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు వాహనాలకు సంబంధించిన రికార్డులకు వెసులుబాటు కల్పించడం జరిగిందని కానీ పన్నులు చెల్లించకుండా వాహనములు తిప్పమని కాదని ఆయన అన్నారు. ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కోవిడ్ 19 నిబంధనలకు లోబడి బస్సులను నడపాలని ప్రతిరోజు బస్సులను శుభ్రపరచుకోవాలన్నారు.