సోమవారం, 10 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 నవంబరు 2025 (19:20 IST)

మంచి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా వృధానే : సీఎం చంద్రబాబు

chandrababu naidu
మంచి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా వృధానే అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానీలో శంకర ఐ ఆస్పత్రి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్‌ ఎక్కడ ఉన్నా .. రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతోందన్నారు.
 
'రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్‌ రికార్డులన్నీ డిజిటలైజ్‌ చేసి.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతాం. రాబోయే రోజుల్లో.. ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్‌ మోడల్‌గా ఉంటుంది. సంపద, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా.. మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అనారోగ్యమే నిజమైన పేదరికం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు శంకర్‌ ఐ ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా.
 
శంకర ఐ ఫౌండేషన్‌ సేవలు బాగున్నాయి. నేపాల్‌, కాంబోడియా, నైజీరియాలోనూ శంకర ఐ ఆసుపత్రులు ఉన్నాయి. కంచి పీఠం పిలుపునిస్తే అనేకమంది దాతలు స్పందిస్తారు. రెయిన్‌బో కార్యక్రమం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు 32 sవేల వైద్య శిబిరాలు నిర్వహించి.. దాదాపు 30 లక్షల మందికి కంటి శస్త్రచికిత్సలు చేశారు. 
 
రోజుకు 750 మందికి కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. శంకర ఐ ఆసుపత్రిని ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. హిందూ ధర్మ పరిరక్షణకు కంచి మఠం అనేక కార్యక్రమాలు చేస్తోంది. పూరి, శృంగేరిలో పీఠాలు స్థాపించి హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారు' అని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.