మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:02 IST)

అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రులో సలీం అనే కౌలు రైతు.. పొలంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సలీం.. పోతుమర్రు గ్రామంలోని పద్మావతికి చెందిన 7.5 ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు. ఆ భూమి యాజమన్య హక్కుల విషయంలో పద్మావతికి, శివారెడ్డి అనే వ్యక్తికి మధ్య వివాదం ఉంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో పంట పొలాన్ని ఎవరు కోయడానికి వీల్లేదని.. కోర్టు తీర్పు వచ్చే వరకు తమ అధీనంలో ఉంటుందని ఎమ్మార్వో నోటీసు జారీ చేశారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు పోలీసులు అక్కడ ఆకాంక్షలు విధించారు. పంటపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయని... సలీం అధికారుల్ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. 
చివరికి పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటానని సలీం ఓ వీడియో విడుదల చేశాడు. 
 
ఈ ఉదయం రెవిన్యూ, పోలీసు అధికారులు పొలం వద్దకు చేరుకోగానే సలీం కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పక్కన ఉన్న వాళ్లు అతడిని ఆపేందుకు యత్నించినా.. అప్పటికే అతను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా నిరసన తెలిపాడు. ఎన్నిసార్లు చెప్పినా.... తనగోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి పోలీసులు.. సలీంను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.