అవాకులు చెవాకులు పేలిన అయ్యన్నపై మరో కేసు నమోదు
రాజకీయ సభల్లో, జనం కేరింతల మధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తే కాదు... తర్వాతి పరిణామాలను కూడా రుచి చూడాల్సి ఉంటుంది. రాజకీయ దిగ్గజం, సీనియర్ నాయకుడు అయిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఇపుడు ఇదే పరిస్థితి ఇపుడు రాష్ట్రంలో ఎదురు కాబోతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా, హోం మంత్రి సుచరితపైనా, ఇతర మంత్రులపైనా అయ్యన్నతీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇపుడు దానిపై ఒక్కోక్క చోట పోలీస్ కేసులు నమోదవుతున్నాయి.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వర్ధంతి సభలో హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై గుంటూరు అరండల్ పేట స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అరండల్ పేట పోలీసులకు న్యాయవాది వేముల ప్రసాద్ ఫిర్యాదు చేశారు. హోం మంత్రి సుచరితపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని పోలీసులకు ప్రసాద్ అనే న్యాయవాది పిర్యాదు చేశాడు. ఆమె జాతిని కించపరిచేలా అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 505(2), 509, 294(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.