1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (23:30 IST)

బయటి శత్రువుల కంటే ఇంటి మిత్రులే ప్రమాదకరం: లెస్స బలికిన నేత

ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో విభజనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాడిన ఎంపీ. విభజన బిల్లుపై చివరిరోజు రహస్యంగా బిల్లుకు ఆమోదముద్ర వేసిన క్షణం వరకు నిజాయితీగా విభజనకు వ్యతిరేకంగా గళమెత్తిన టీడీపీ ఎంపీ. పార్లమెంటులో ఆ చివరిరోజు కాంగ్రెస్ ఎంపీ

ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో విభజనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాడిన ఎంపీ.  విభజన బిల్లుపై చివరిరోజు రహస్యంగా బిల్లుకు ఆమోదముద్ర వేసిన క్షణం వరకు నిజాయితీగా విభజనకు వ్యతిరేకంగా గళమెత్తిన టీడీపీ ఎంపీ. పార్లమెంటులో ఆ చివరిరోజు కాంగ్రెస్ ఎంపీల పిడిగుద్దుల బారిన పడినా విభజన వ్యతిరేక గళాన్ని మానని నేత తను.  కానీ ఆ నిజాయితీకి కానీ, ఆ నిబద్ధతకు కాని ఇప్పుడు ఆ టీడీపీలోనే స్థానం లేకపోవడం అంతటి ఎంపీకి కూడా ఇప్పుడు ఆవేదన కలిగిస్తోంది. కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీలో ఆయన  ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని ఆవేదన  వ్యక్తం చేస్తున్న ఆయన ఎవరో కాదు. ప్రస్తుతం గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి.
 
శత్రువుల కన్నా టీడీపీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టమని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని చెప్పారు.
 
పేదలు, కార్యకర్తల కోసం చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. పార్టీ అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా నగరపాలక సంస్థ ఎన్నికలుగానీ, వక్ఫ్‌బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయలేక కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారనీ పార్టీ పదవులతో విజిటింగ్‌ కార్డులు కొట్టించుకొని అమరావతిలో సెటిల్‌మెంట్‌లు చేసుకునేవారు ఎక్కువయ్యారన్నారు. 
 
తెలుగు దేశం వ్యవహారాలపై టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా చేసిన ఈ సత్య ప్రకటన, అధికారంలోకి వచ్చాక పార్టీలో పొడసూపుతున్న లుకలుకలను చాటి చెబుతోంది. మాజీ ఎంపీకే టీడీపీలో ఇంతటి  విలువ ఏడ్చి చస్తున్నప్పుడు, ఇక అనామకుల పరిస్థితి చెప్పనవసరం లేదు కదా..