జూలై 5 నుంచి ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభం - ఏప్రిల్ 29 చివరి పనిదినం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి పునఃప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కాలెండర్‌ను విడుదలచ వచ్చేంది. ఈ క్యాలెండర్ ప్రకారం జులై 5 నుంచి పునఃప్రారంభి వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పాఠశాలలకు ఉండే మూడు స్థానిక సెలవులను వినియోగించుకుంటే వాటికి బదులు అదే నెలలో రెండో శనివారం, ఆదివారాల్లో బడులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇప్పటివరకు ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది పునఃప్రారంభ సమయాన్ని మార్చేశారు. జులై ఐదో తేదీకి తీసుకొచ్చారు. జులై 5 నుంచి ఏప్రిల్ 29 వరకు 2022-23 విద్యా సంవత్సరంలో బడులు 220 రోజులు పని చేస్తాయి. 1-9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి.
ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ప్రతి తరగతికి వారానికి 48 పిరియడ్లు ఉంటాయి. సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38 నుంచి 39 పిరియడ్లు బోధించాల్సి ఉంటుంది. 1-5 తరగతులకు మొదటి 40 రోజులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి వరకు 30రోజుల పాటు విద్యార్థులను సంసిద్ధం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పూర్వప్రాథమిక విద్య, ఒకటి రెండు తరగతులు ఉండే ఫౌండేషన్, 1-5 తరగతుల ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల నిర్వహణ ఐచ్ఛికం. ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. 4 గంటల నుంచి 5గంటల వరకు ఆటలు, పునశ్చరణ తరగతులను ఆయా బడులు ఐచ్ఛికంగా నిర్వహించుకోవచ్చు. వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే ఉంటుంది.
అంతేకాకుండా, దసరా సెలవులు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6వరకు ఉంటాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు ఇస్తారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి.