సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (16:43 IST)

రైతులను జగన్ మోసం చేశాడా? మనం ఏం చేశామో ఆత్మపరిశీలన చేసుకోవాలి...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై సోమవారం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరి స్పందించారు. రైతులను జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేదన్నారు. పైగా, గత ఐదేళ్ల కాలంలో రైతులకు మనం (తెదేపా) ఏం చేశామో ఆత్మపరిశీలన చేసుకోవాలని సలహా ఇచ్చారు. 
 
గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మద్దాల గిరి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే జగన్మోహన్ రెడ్డిని కలిశానని, అక్కడి పరిస్థితిని వివరించానని చెప్పారు. 
 
నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం వెంటనే రూ.25 కోట్లు వెంటనే విడుదల చేయాలని జగన్ ఆదేశించారని అన్నారు. సీఎం జగన్ కార్యదక్షత ఉన్న నాయకుడని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో గుంటూరు నగరం అధ్వానంగా మారిందని, అమరావతిలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. అదేసమయంలో ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న మనం రైతులకు ఏం చేశామో ఆత్మపరిశీలన చేసుకోవాలని మద్దాల గిరి అన్నారు.