1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (10:44 IST)

మూడు కాదు... 25 రాజధానులు నిర్మించాలి : కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శనాస్త్రాలు సంధించారు.
 
'జగన్ గారూ మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి' అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 
 
రాజధానిపై రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. అమరావతి రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, రాజధాని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రాజధాని బినామీలతో ఒక పుస్తకాన్ని ప్రచురించామని, అందులో పేర్లు ఉన్నవాళ్లు మాత్రమే నష్టపోతారన్నారు. 
 
బీజేపీ నేతలు సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి వ్యక్తులకే నష్టమని సూచనప్రాయంగా వెల్లడించారు. విశాఖ సమీపంలోని భీమిలి పట్టణానికి రాజధాని రావడం సంతోషంగా ఉందని, భీమిలి ఒక మహాపట్టణంగా వెలుగొందుతుందని విజయసాయి అన్నారు. రాజధాని కోసం భూములు సర్వే చేస్తున్నామని, విశాఖ నగరంలో, బయట కూడా సర్వే చేస్తామని, సర్వే పూర్తయ్యాక సీఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు. 
 
రాజధాని విషయంలో టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యలపైనా విజయసాయి స్పందించారు. వ్యక్తిత్వంలేని ఉమ కామెంట్లు చేస్తే తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఉమ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.