మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (16:28 IST)

మూడుపై తర్వాత స్పందిస్తా... అభివృద్ధంటే నాలుగు భవనాలు కాదు : పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ కమిటీ కూడా రాష్ట్రాన్ని వివిధ ముక్కలుగా చేసి పాలన సాగించాలని సూచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 
 
మూడు రాజధానులతో పాటు.. ఈ కమిటి నివేదికపై టీడీపీతో పాటు.. పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అలాగే, అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళనబాటపట్టారు. ఈనేపథ్యంలో జనసేన పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారని, వారి నిర్ణయం తర్వాతే తాము మాట్లాడతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
మంత్రిమండలి తీసుకునే నిర్ణయాన్ని తాము జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తామని వెల్లడించారు. అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదని, అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.