శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (16:18 IST)

జగన్‌కు జైకొట్టిన చిరంజీవి.. మూడు రాజధానులపై ఏమన్నారంటే...

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనపై ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇపుడు మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ పాలన ప్రణాళికాబద్ధంగా సాగుతోందంటూ వ్యాఖ్యానించారు. పైగా, మూడు రాజధానుల అంశంపై చిరంజీవ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానులపై స్పందించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనన్న చిరంజీవి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మూడు రాజధానుల అంశాన్ని అందరూ స్వాగతించాలని చిరు అభిప్రాయపడ్డారు. 
 
గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ నగరంలోనే కేంద్రీకృతమైందని, ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. ఇప్పుడు అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని అందరిలోనూ ఆందోళన ఉందన్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై నెలకొన్న అపోహలను, అపార్థాలను ప్రభుత్వం తొలగించాలని చిరంజీవి సూచించారు.