శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (12:31 IST)

మీ స్వామి సొమ్ములు సాములోరికి పంపండి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు విశాఖ శారదా పీఠానికి తరలించనున్నారు. వచ్చే నెల నుంచి నెల రోజుల పాటు నిర్వహించే జాతీయ హిందూ ధార్మిక సదస్సు కోసం ఈ నిధులను సమర్పించనున్నారు. దీంతో పలు ఆలయాల ఈవోలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఎందుకంటే.. భక్తులు సమర్పించిన కానుకలు శారదా పీఠానికి ఎలా ఇవ్వాలన్న అంశంపై వారు మదనపడుతున్నారు. 
 
అసలు ఆలయాల నిధులను శారదా పీఠానికి ఎందుకు ఇవ్వాలంటే... జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు హిందూ ధర్మపరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్ణయించారు. నెలరోజులపాటు సాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సాయం చేయాలంటూ గతనెల 11న విశాఖ శారదాపీఠం నుంచి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు లేఖ వెళ్లింది. 
 
మహాసభల నిర్వహణకు తగిన ఆర్థిక సహాయం అందించాలని శారదాపీఠం కోరింది. ఈ లేఖను పరిశీలించి, పరిగణలోకి తీసుకోవాలని మంత్రి దేవాదాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేశారు. కమిషనర్‌ ఇదే ప్రతిపాదనను శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాల ఈవోలకు పంపించారు. 
 
'పవిత్రమైన స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభల నిర్వహణకోసం ఆర్థిక సహాయం కోరారు. ఆ లేఖ ప్రతిని మీకు పంపిస్తున్నాం. హిందూ సనాతర ధర్మ ప్రచారం కోసం ఉద్దేశించిన కార్యక్రమానికి నిధులు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉంటే, పరిగణలోకి తీసుకోవడానికి తగిన ప్రతిపాదనలు పంపించండి' అని దేవాదాయ శాఖ కమిషనర్ ఐదు ప్రధాన ఆలయాల ఈవోలకు లేఖ రాశారు. ఇలా లేఖ రాయడం ఇపుడు వివాదాస్పదంగా మారింది.