శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2019 (13:25 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు... అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన

ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కొద్దికాలంగా అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై విస్తృత చర్చ నడుస్తోంది. మంగళవారం నాడు అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ రాజధానిపై ఆసక్తికర ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా మోడల్ అవలంబించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 
"దక్షిణాఫ్రికా దేశాన్ని చూస్తే వారికి మూడు రాజధానులుంటాయి. బహుశా అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టొచ్చు, అసెంబ్లీ పెట్టొచ్చు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టొచ్చు. యంత్రాంగం అంతా అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చెయ్యవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ విధంగా జ్యుడీషియల్ కేపిటల్ ఓవైపు, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మరోవైపు, లెజిస్లేటివ్ కేపిటల్ ఇక్కడా (అమరావతి) ఉండొచ్చు. బహుశా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు రావలసిన అవసరం కనిపిస్తోంది" అని జగన్ అన్నారు.

 
"విశాఖప‌ట్నాన్ని కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని చేస్తే ఖ‌ర్చేమీ ఉండ‌దు. అక్క‌డ అన్నీ ఉన్నాయి. ఒక్క మెట్రో రైల్ వేసి, రోడ్డు ట్రాఫిక్ స‌రిచేయ‌డానికి కొంత ఖ‌ర్చు చేస్తే స‌రిపోతుంది" అని జగన్ వ్యాఖ్యానించారు. రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి మేలు చేయాల్సి ఉందని అన్నారు. "53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చేయడానికి లక్ష కోట్లు కావాలి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని సీఎం అన్నారు.మరో వారం రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా భవిష్యత్‌లో చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు.

 
సీఎం ప్ర‌క‌ట‌న‌లో ఏం చెప్పారు
రాజ‌ధానిపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... "తొలుత‌ రాజ‌ధాని ప్రాంతంగా ఎంపిక చేసి, చుట్టూ త‌న బినామీల భూములు కొనుగోలు త‌ర్వాత.. రాజధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించారు. ఈ ప్రాంతంలో 53వేల ఎక‌రాల్లో మౌలిక స‌దుపాయాల‌కు చంద్ర‌బాబు అంచ‌నా ప్ర‌కార‌మే ప్రాథమిక అవ‌స‌రాల కోస‌మే రూ.ల‌క్షా 9 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. వడ్డీలు అన్నీ క‌లుపుకుంటే అది మూడు నుంచి నాలుగు ల‌క్ష‌ల కోట్ల‌కు చేర‌వ‌చ్చు.


ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు ఖ‌ర్చు చేసింది రూ. 5,800 కోట్లు. వాటిని కూడా 10.32 శాతం వ‌డ్డీకి బాండ్ల పేరుతోనూ, ఇత‌ర ర‌కాలుగా తెచ్చారు. దానికి వ‌డ్డీ కింద ఏటా రూ.700 కోట్లు క‌ట్టాల్సి వ‌స్తోంది. ఐదేళ్ల‌లో 5,800 కోట్లు పెడితే మిగిలిన ల‌క్ష కోట్ల‌కు పైగా డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో ఆలోచించాలి. వాటికి వ‌డ్డీలు మ‌నం భ‌రించ‌గ‌ల‌మా లేదా అన్న‌ది చూసుకోవాలి. నాకు కూడా క‌ట్టాల‌నే ఉంది. కానీ ల‌క్ష కోట్లు ఎక్క‌డి నుంచి తేవాల‌న్న‌దే అర్థం కావ‌డం లేదు" అని అన్నారు.

 
ఖ‌ర్చులు చాలా ఉన్నాయి..
పోల‌వ‌రం నుంచి బొల్లేప‌ల్లిలో రిజ‌ర్వాయ‌ర్ క‌ట్ట‌డం, పులిచింత‌ల నింప‌డం, దాని ద్వారా రాయ‌ల‌సీమ‌కు నీరు ఇవ్వాల‌నే ప్రాజెక్ట్ త‌యారు చేస్తుంటే రూ.50 నుంచి 60వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెబుతున్నారు. ఇన్ని వ‌ర్షాలు ప‌డినా, కాలువ‌ల సామ‌ర్థ్యం లేక‌పోవ‌డంతో నీరు అంద‌డం లేదు. దానికోసం చూస్తే రూ.23వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నాలున్నాయి. ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి కోసం రూ.16వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెబుతున్నారు.

 
రాష్ట్ర‌మంతా తాగునీటి స‌మ‌స్య ఉంది. గోదావ‌రి జిల్లాల్లో కూడా ఆక్వాసాగు వ‌ల్ల తాగునీరు ఉప్పునీరుగా, క‌లుషితంగా మారిపోయింది. అన్ని గ్రామాల‌కు తాగునీరు పైప్ లైన్ ద్వారా ఇద్దామంటే గోదావ‌రి జిల్లాల‌కే రూ.8వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా తాగునీళ్లు ఇవ్వ‌డానికే రూ.40 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. స్కూళ్లు శిథిలావ‌స్థ‌లో ఉన్నాయి. ఆసుప‌త్రుల్లో ఆప‌రేష‌న్లు సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో చేస్తున్నారు. ఎలుక‌లు క‌రిచి పిల్ల‌లు చ‌నిపోతున్నారు. 'నాడు-నేడు' ప‌థ‌కంలో వాటిని బాగు చేద్దామంటే, ఖ‌ర్చుల‌కే రూ.30వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

 
మ‌రోవైపు సంక్షేమ కార్య‌క్ర‌మాల ఖ‌ర్చు కూడా ఉంది. వాటితో పాటుగా ఈ 20 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలోని 50వేల ఎక‌రాల్లో అభివృద్ధికి ల‌క్ష కోట్లు కావాల్సి ఉంది. రోడ్లు, డ్రైన్లు, క‌రెంటు కోస‌మే అంత ఖ‌ర్చ‌వుతున్న ప‌రిస్థితుల్లో ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న వ్య‌క్తి ఐదేళ్ళ‌లో రూ.5వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే మ‌నం వేసే ప్ర‌తి అడుగు ఆచితూచి వేయాలి.

 
చంద్ర‌బాబు తీరు వ‌ల్లే ఈ ప‌రిస్థితి
సీఎం ప్ర‌క‌ట‌న‌కు ముందు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ కూడా రాజ‌ధాని అంశంపై మాట్లాడారు. ఆయ‌న కూడా చంద్ర‌బాబు తీరుని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అంతా త‌న‌వ‌ల్లే జ‌రిగింద‌ని ఆయన చెప్ప‌డం అసంబద్ధం అన్నారు. ఏపీ రాజ‌ధాని పేరుతో పెద్ద స్కామ్ జ‌రిగిందంటూ ప‌లువురి పేర్లు ప్ర‌స్తావించారు. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌కు ముందుగా హెరిటేజ్ ఫుడ్స్‌తో పాటుగా నాటి ప్ర‌భుత్వంలో మంత్రులు, ఇత‌ర నేత‌లు భూములు కొనుగోలు చేశారంటూ వెల్ల‌డించారు. ఇలాంటి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

 
ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత‌లకు, పాల‌క ప‌క్ష స‌భ్యుల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌డంతో స‌భ‌లో కొంతసేపు గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. దాంతో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లిన 9మంది టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు. వారిని మార్ష‌ల్స్ స‌హాయంతో బ‌య‌ట‌కు త‌ర‌లించారు.

 
సెల్ఫ్ ఫైనాన్సుడు రాజ‌ధాని ప్ర‌తిపాదించాం..
అంత‌కుముందు చ‌ర్చ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు త‌న హ‌యాంలో జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌ను వివ‌రించారు. రాజ‌ధాని లేని రాష్ట్రం కోసం రైతులు ముందుకొచ్చి ల్యాండ్ ఫూలింగ్‌లో ఇచ్చిన భూముల ద్వారా సెల్ఫ్ ఫైనాన్సుడు రాజ‌ధానికి శ్రీకారం చుట్టామ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

 
"హైద‌రాబాద్ అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. సైబ‌రాబాద్ న‌గరాన్ని నిర్మించాం. అదే స్ఫూర్తితో అమ‌రావ‌తి అభివృద్ధి కోసం అడుగులు వేశాం. రాష్ట్రాల అభివృద్ధిలో రాజ‌ధానుల నుంచి వ‌స్తున్న ఆదాయ‌మే ఇప్పుడు కీల‌కంగా ఉంది. కోల్‌క‌తా, హైద‌రాబాద్ వంటి అనుభ‌వాలు దానికి నిద‌ర్శ‌నం. అమ‌రావ‌తిలో నిర్మాణాల‌కు ఎక్కువ వ్య‌యం అవుతుంద‌న‌డంలో వాస్త‌వం లేదు. అంద‌రి అభిప్రాయాల‌కు అనుగుణంగా రాజ‌ధాని ఎంపిక చేసి అభివృద్ధికి బాటలు వేశాం" అని చంద్రబాబు వివ‌రించారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు.

 
ముఖ్యమంత్రి అమరావతిలో ఉంటారా? విశాఖలో ఉంటారా?
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పడంపై విపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ఇలా మూడు రాజధానులుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. ''రాజధానిపై స్పష్టత అడిగితే సస్పెండ్ చేశారు. జిల్లాకు ఒక ఆఫీసు పెడతారట. హైకోర్టుకు వెళ్లాలంటే ఒక జిల్లాకు, సెక్రటేరియట్‌కు వెళ్లాలంటే మరొక జిల్లాకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు అమరావతిలో చట్టాలు చేయడానికి వచ్చి, సెక్రటేరియట్ కోసం విశాఖకు, హైకోర్టు పనుంటే కర్నూలుకు వెళ్లాలా?


అమరావతికే దిక్కు లేదు... : పవన్ కల్యాణ్
ఒక్క అమరావతి నిర్మాణానికే నిధులు లేవు అంటున్న జగన్... ఇప్పుడు మూడు రాజధానులు నిర్మిస్తామనే ప్రతిపాదన తేవడం అసలు సాధ్యమేనా అని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదు అని ఆయన అన్నారు.

 
సౌతాఫ్రికాకు మూడు రాజధానులు
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. ప్రిటోరియా నగరం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాగా, బ్లోయెంఫౌంటీన్ జ్యుడీషియల్ కేపిటల్, కేప్‌ టౌన్ లెజిస్లేటివ్ కేపిటల్‌గా ఉన్నాయి. అయితే దేశంలో అతి పెద్ద నగరం జోహన్నెస్‌బర్గ్.