ఫేక్ న్యూస్ వేసిన చోటే రేపు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు
పాఠకులను ఏప్రిల్ ఫూల్స్ చేసేందుకు ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనం ఇపుడు చిక్కుల్లో పడేసింది. ఏదో సరదాగా చేయాలని ప్రారంభించిన ఒక కథనానికి బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే... ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఏప్రిల్ ఒకటో తేదీనాటి సంచికలో తెరాస కీలక నేత హరీష్ రావు ఆ పార్టీని వీడి... బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనానికి చివర్న ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అందర్నీ ఫూల్స్‌ను చేసింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ... ఈ కథనంపై తెరాస నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.
'నా గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థ నుండి వచ్చిన కథనం ఫేక్ న్యూస్‌లకు ఒక ఉదాహరణ మాత్రమే. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదు. ముఖ్యంగా దేశం మొత్తం ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలా వ్యవహరించడం సముచితమైనది కాదు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరుతున్నానని పేర్కొన్న ఆయన... ఏ పేజీలో అయితే తనపై తప్పుడు వార్తను ప్రచురించారో... అదే పేజీలో రేపు తనకు క్షమాపణలు చెప్పాలి.' అంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసారు.