శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:10 IST)

ఆంధ్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన తెరాస నేత

మొన్నటి దాకా... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి జోస్యాలు చెప్పుకొచ్చేసిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాజకీయాలతో తమకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు.
 
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదనీ స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారనీ చెప్పుకొచ్చిన ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కేసీఆర్‌ తన కింద పని చేసారని చంద్రబాబు అనడం ఆయన అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పడు అప్పటి సీఎంల కింద పని చేసారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాది అని ఆయన మండిపడ్డారు. 
 
ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరబోమని చంద్రబాబు గట్టిగా చెప్పలేరనీ... ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమేనని, గతంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారని గుర్తుచేసారు. మోడీ, రాహుల్‌ సైతం ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతూ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారనీ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్‌ తెలంగాణలో ప్రచారం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ.. కొన్ని జాతీయ పార్టీల కంటే తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా కూడా ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.