బుధవారం, 16 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఏప్రియల్ 2025 (10:08 IST)

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఒకవైపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరోవైపు, వడగాలులు వీచే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 98 మండలాల్లో సోమవారం వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 
 
వడగాలులకు గురయ్యే మండలాలు విషయాన్ని వస్తే అల్లూరు-5, కాకినాడ-9, కోనసీమ-8, తూర్పుగోదావరి-7, ఏలూరు-8, కృష్ణా-10, గుంటూరు-13, బాపట్ల-9, పల్నాడు-5, ప్రకాశం-6 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
 
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వడగాలులు, పిడుగుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.