సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (14:23 IST)

తెలుగు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు..?

తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం వేడి తీవ్రత ఎక్కువై నిప్పుల కుంపటిలా మారాయి. తెలంగాణవ్యాప్తంగా 42 డిగ్రీల నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.


ఉదయం 8 గంటలకు ఎండ తీవ్రతకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కూలీలు, కార్మికులు మరియు ఉద్యోగులు వడదెబ్బల బారినపడుతున్నారు. సోమవారం ఒక రోజే వడదెబ్బ కారణంగా తెలంగాణవ్యాప్తంగా 15 మంది చనిపోయారు.
 
రోజురోజుకూ ఎండతీవ్రతకు అలాగే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాయువ్యలోని రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తున్నాయి.

దీని వల్ల ఈరోజు కూడా వడగాడ్పుల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 వడగాడ్పు రోజులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు.
 
ఇలాంటి సమయంలో ఛత్తీస్‌గడ్, తెలంగాణ మీదుగా కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.