ఎడతెగని వాన... కోస్తాలో తుపాను తాకిడి (వీడియో)
విశాఖపట్నం: నిన్నమొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఇపుడు దానికి రివర్స్... జోరున వర్షం... తుపాను బీభత్సం... ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. నగరాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. తుపాను ప్రభావం వల్ల భారీ వర్షాలుంటాయని తుపాను హెచ్చరికల శాఖ ముందే సూచించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద బందరు పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాల వారు అక్కడి నుంచి ఖాళీ చేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బందరు పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకుండా కట్టడి చేశారు. మచిలీపట్నంలో తుపాను కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 0822-25257, 1077 నెంబర్లను ఏర్పాటు చేశారు.
విశాఖ తీరంలోనూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అన్ని ప్రాంతాలు జలమయ్యాయి. జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు మునక భయంతో తల్లడిల్లుతున్నాయి. విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం వల్ల గాజువాక, అనకాపల్లి కుంచమాంబ కాలనీలో ఇళ్ళలోకి నీరు ముంచెత్తుతోంది. నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.