శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (10:08 IST)

ఆంధ్రలో టెన్త్ విద్యార్థులకు మార్కులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు మార్కులను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు మార్కుల విధానాన్ని హైపవర్‌ కమిటీ ఖరారు చేసింది. 
 
ఈ మేరకు హైపర్ కమిటీ నిర్వహించిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది. 
 
నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది. ఆపై వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి.
 
ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్‌ 3) సబ్జెక్టుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది. 
 
అయితే బెస్ట్‌ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020-21, 2019-20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు.