గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 11 సెప్టెంబరు 2021 (22:55 IST)

సమాజంలో శక్తివంతమైన సాధనంగా ప్రజాసంబంధాలు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ప్రజా సంబంధాల నిపుణులకు విస్రృత అవకాశాలు కలిపిస్తూ వారి నైపుణ్యాలను నిరంతరం మెరుగు పరచటంలో భారత ప్రజా సంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) చేస్తున్న కృషి ఎంచదగినదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్  హరిచందన్ అన్నారు. ఈ రంగంలో ఉన్నత అవకాశాలు పొందాలనుకునే యువతకు ప్రోత్సాహం అందిస్తూ అనుబంధ రంగాల అవకాశాలను సమన్వయం చేయటం ముదావహమన్నారు.
 
భారత ప్రజా సంబంధాల మండలి తన 50 వ శాఖను విశాఖపట్నంలో ప్రారంభిస్తున్న తరుణంలో శనివారం రాత్రి గౌరవ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ రంగంలోని వారికి వారి పని ప్రాంతాలలో ఉన్నత నైతిక ప్రమాణాలను ప్రోత్సహించడం, బనిపుణులు, అభ్యాసకుల మధ్య అనుసంధాన వేదికగా వ్యవహరించటం ద్వారా భారత ప్రజా సంబంధాల మండలి మంచి పనితీరును చూపుతుందన్నారు.
 
2004 మార్చి 3న ఏర్పడిన ఈ సంస్ధ పాన్-ఇండియాగా 42 నగరాలు, పట్టణాలతో పాటు బంగ్లాదేశ్, ఢాకా, శ్రీలంక, దుబాయ్, నేపాల్‌లలో ఐదు అంతర్జాతీయ చాప్టర్‌లతో వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచడానికి చేస్తున్న కృషి చేస్తుంది అభినందనీయమన్నారు. ఈ వేదిక పరిశ్రమలోని సహచరులతో జ్ఞానాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు.
 
ప్రజా సంబంధాల నిపుణుల కోసం అంతర్జాతీయ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందించడంతో పాటు, పబ్లిక్ రిలేషన్స్ , కమ్యూనికేషన్‌లో తాజా పరిణామాలు, ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలపై నిశితంగా చర్చించడానికి దోహాదపడుతుందన్నారు. సభ్యులతో పాటు ఔత్సాహికులకు కూడా ఉపయోగపడేలా మంచి పుస్తకాలను ముద్రించటం, విద్యార్ధులకు ఈ రంగంలో ప్రత్యేక శిక్షణ అవకాశాలను కలిగించటం దేశీయంగా ఉన్న ప్రజా సంబంధాల నిపుణులకు ఉపయిక్తమన్నారు.
 
ఈ రంగంలో యువత సాధించిన ఉన్నతికి గుర్తుగా కౌటిల్య, చాణక్య అవార్డులు అందించటం వారిని పునరుత్తేజితులను చేస్తుందన్నారు. ప్రజా సంబంధాలు అనేవి పరిస్ధితులకు అనుగుణంగా మారుతుంటాయని, అత్యంత శక్తివంతమైన ఈ సాధనాన్ని తక్కువగా అంచనా వేయకూడదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
 
ప్రజా సంబంధాల విషయంలో జాగ్రత్తగా ప్రణాళిక సిధ్దం చేసి అమలు చేయగలిగితే ఆయా సంస్ధల విజయానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పిఆర్ సిఐ ఛైర్మన్ ఆర్ఎన్ మహాపాత్ర,  తూర్పు జోన్ ఛైర్మన్, చీఫ్ మెంటార్ ఎంబి జయరామ్, పిఆర్ సిఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ కుమార్, పిఆర్సిఐ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షడు కెవిఆర్ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.