స్పందనలో సీఐ దరుసు ప్రవర్తన... ఆత్మహత్య చేసుకుంటామని ఫేస్ బుక్ లో వీడియో
కడప జిల్లా మైదుకురు ఘటనపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్ స్పందించి, మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మైదుకురులో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఈ సంఘటన తన దృష్టికి వచ్చిందని, వెంటనే దీనిపై స్పందిస్తున్నానని కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ చెప్పారు.
తాము తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్బర్ భాషా ఈ నెల 9న తన ఫేస్ బుక్ అకౌంట్లో వీడియో సందేశం పెట్టాడు. అదే రోజు ఆయన పోలీస్ స్పందనలో ఒక పిటిషన్ కూడా పెట్టారు.
ఆ పిటిషన్ పై విచారించి అదే రోజు వెంటనే వారికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పామని ఎస్పీ తెలిపారు. అయితే, దీనిపై మైదుకూరు సీఐ కొండారెడ్డి దురుసుగా ప్రవర్తించారని బాధిత కుటుంబం ఆరోపించింది. దీనితో అక్బర్ భాషా కుటుంబం ఆత్మహత్యకు సిద్ధం అయినట్లు వీడియో సందేశం పెట్టారు. ఇది గమనించి, తనకు సీఎం కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చిందని ఎస్పీ తెలిపారు.
ఈ వివాదంపై అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారిని విచారణ అధికారిగా నియమించామని కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ చెప్పారు. మైదుకురు రూరల్ సిఐ కొండారెడ్డిని ఈ విచారణ అయ్యేంత వరకు విధుల నుంచి తప్పిస్తున్నామని వివరించారు. ఏడు రోజుల్లో నివేదిక రాగానే, సంబంధిత అధికారిపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ చెప్పారు. ఈ సంఘటనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.