బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (07:51 IST)

సాయిధరమ్‌కు యాక్సిడెంట్ : ఇసుక ఉండటం వల్లే బైక్ స్కిడ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ శుక్రవారం రాత్రి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన నడుపుకుంటూ వచ్చిన స్పోర్ట్ బైక్ కేబుల్ బిడ్జిపై ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఆయన ఈ ప్రమాదాని గురయ్యారు. 
 
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 
 
మెడికవర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి సాయిధరమ్‌ను తరలించి నిపుణులతో కూడిన వైద్య బృందం పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
ఆ తర్వాత సాయిధరమ్‌కు అందించే వైద్య సేవలపై అపోలో ఆస్పత్రి ఒక మెడికల్ బులిటెన్‌ను రిలీజ్ చేసింది. స్పోర్ట్స్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. 
 
ఈ ప్రమాదంలో సాయి కుడి కంటి భాగంతో పాటు చాతీ భాగంలోనూ గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాలర్ బోన్ విరగడం మినహా శరీరంలో అంతర్గత గాయాలేవీ లేవని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
 
సాయి తేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సాయి మద్యం తాగి డ్రైవ్ చేయలేదని, ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించే ఉన్నాడని తెలిపారు. రోడ్డుపై ఇసుక ఉండడంతో బండి జారి ప్రమాదం జరిగిందని వివరించారు. అల్లు అరవింద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సాయితేజ్ సేఫ్‌గానే ఉన్నాడని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
 
ఇదిలావుంటే, సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్తతో మెగా కుటుంబంలో ఆందోళన నెలకొంది. సాయితేజ్ కుటుంబ సభ్యులు మెడికవర్ ఆసుపత్రికి పరుగులు తీశారు.
 
జూబ్లీహిల్స్ రోడ్ నెం45, గచ్చీబౌలి మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన స్పోర్ట్స్ బైకుపై వేగంగా వెళుతున్న తరుణంలో కేబుల్ బ్రిడ్జిపై అదుపు తప్పింది. ఒక్కసారిగా స్కిడ్ కావడంతో సాయితేజ్ తీవ్రంగా గాయపడ్డారు.
 
కాగా, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఘటన జరిగిన సమయంలో సాయితేజ్ బైకుపై గంటకు 120 కిమీ వేగంతో వెళుతున్నట్టు తెలిసింది. రోడ్డుపై ఇసుక ఉండడంతో ఆయన బైకును అదుపు చేయలేక ప్రమాదం బారినపడ్డట్టు ప్రత్యక్షసాక్షుల కథనం. 
 
తమ మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి తరలివచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 
 
అయితే, శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై 108 సిబ్బంది తమకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. 
 
ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బైక్‌పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.