శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 2 మే 2019 (21:18 IST)

ప్రియురాలి భర్తను చంపేందుకు ప్లాన్ వేస్తే... అతడితో పాటు మరో స్త్రీ కూడా...

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరం దళితవాడలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్న ప్రియురాలి భర్తను చంపేందుకు ఆమె ప్రియుడు వేసిన ఎత్తుగడ ఊహించని మలుపు తిరిగింది. విషం కలిపిన శీతల పానీయాన్ని ప్రియురాలి భర్తకు ఇవ్వాలంటూ తన స్నేహితుడైన మధ్యవర్తి ద్వారా పంపించాడు ప్రియుడు. కానీ ఆ మధ్యవర్తి ఆమె భర్తతో తాగించాక మిగిలిన పానీయాన్ని తన ఇంటికి తీసుకువచ్చి అలా అటకపై పెట్టాడు. 
 
ఆ విషయం తెలియని అతని భార్య కూల్ డ్రింక్ కదా అని తాగేసింది. కాసేపటికే ఇద్దరూ అస్వస్థతకు లోనయ్యారు. మృత్యు ఒడికి చేరారు. పెళ్లిళ్లయ్యి పిల్లలకు తల్లిదండ్రులయ్యాక కూడా ఓ జంట సాగించిన వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. మూడు సంసారాలను నిలువునా కూల్చేసింది.
 
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరం దళితవాడకు చెందిన తాపీ మేస్తిరి గోపి, సత్యవేడు సమీపంలోని బాలక్రిష్ణాపురానికి చెందిన పరిమళకు పదిహేనేళ్ళ క్రితం వివాహమైంది. పరిమళకు తన సమీప బంధువు వేలాయుధంతో పెళ్లికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. వేలాయుధం.. పరిమళలకు ఓ దశలో వీరి మధ్య పెళ్ళి ప్రస్తావన కూడా వచ్చింది. అయితే చివరకు పరిమళను గోపికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 
 
ఐతే పాత పరిచయం కారణంగా గత ఐదేళ్ళుగా వేలాయుధం, పరిమళ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. భర్త గోపి గమనించి పరిమళను మందలించాడు. దీనితో పరిమళతో వేలాయుధం కలవడం గగనమైంది. దీంతో మానసికంగా దెబ్బతిన్నాడు. మద్యానికి బానిసయ్యాడు. తన ప్రియురాలిని తనతో కలవనివ్వకుండా చేస్తున్న గోపిని ఎలాగైనా అడ్డుతగిలించుకోవాలని చూశాడు వేలాయుధం.
 
తన స్నేహితుడు మేఘవర్ణం సహాయంతో గోపికి మద్యంలో విషం తాగించాడు. అయితే మేఘవర్ణం గోపికి మద్యం తాగించిన తరువాత కూల్ డ్రింక్‌లో మిగిలిన సగాన్ని తన ఇంటిలో పెట్టాడు. ఈ విషయం భార్యకు తెలియకపోవడంతో కూల్‌డ్రింక్‌ను తాగేసింది. దీంతో ఆమె కూడా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.