గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:36 IST)

బోర్డుపై పాఠాలు చెపుతున్న మహిళా టీచర్‌ను విద్యార్థుల ముందే కత్తితో పొడిచేసిన భర్త

పశ్చిమ గోదావరి జిల్లాలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలిని ఆమె భర్త కత్తితో పొడిచిన సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెపుతున్న సమయంలో క్లాసు గదిలోకి దూసుకు వచ్చిన అతడు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప.గో జంగారెడ్డి మండలానికి చెందిన దుర్గాప్రసాద్ 2016లో నాగలక్ష్మి అనే మహిళను పెళ్లాడాడు. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా వుంది. ఐతే భార్యాభర్తల మధ్య ఓ విషయంపై మనస్పర్థలు రావడంతో ఆమె భర్తకు దూరంగా వుంటోంది. మండల ప్రజాపరిషత్ పాఠశాలలో పనిచేసే ఈమె తన భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
 
అక్కడే వుంటే ఏదయినా అఘాయిత్యం చేస్తాడన్న భయంతో కాకిలేరు పాఠశాలకు బదలీ చేయించుకుంది. ఐతే దుర్గాప్రసాద్ అక్కడికే వచ్చి క్లాస్ రూంలో పాఠాలు చెపుతున్న ఆమెపై కత్తితో దాడి చేసాడు. విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వున్నట్లు వైద్యులు తెలిపారు.