సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:45 IST)

గణేశ్ నిమజ్జనం : భళా.. బస్తీ వినాయకా... బాలాపూర్ లడ్డూ ధర రికార్డు బద్ధలు

హైదరాబాద్ మహానగరంలో గణపతుల నిమజ్జనోత్సవం లక్షలాది మంది భక్తజన సందోహం నడుమ శోభాయామానంగా ముగిసింది. బోలో గణేశ్ మహరాజ్‌కీ జై, గణపతి బప్పా మోరియా...ఆదా లడ్డూ చోరియా నినాదాలతో నగరవీధులు హోరెత్తాయి. ప్రత్యే క అలంకరణ, వివిధ రకాల ఆకారాల్లో కొలువుదీరిన గణపతులను చూసేందుకు భక్తులు ఆసక్తి ప్రదర్శించారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నమూనాతో తయారుచేసిన విగ్రహం ఆకర్షించింది. 
 
గురువారం ఉదయం ఐదుగంటల నుంచే మహాగణపతిని లారీపైకి చేర్చే కార్యక్రమం మొదలైంది. ఎనిమిది గంటలకు శోభాయాత్ర మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు హుస్సేన్‌సాగర్ తీరానికి చేరాక అర్చకులు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చినభక్తులతో హుస్సేన్‌సాగర్ నలువైపులా ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. జర్మనీ, యూఎస్, యూఏఈకి చెందిన విదేశీయులు కూడా నిమజ్జనాన్ని తిలకించారు.
 
మరోవైపు, గణేశ్ లడ్డూ వేలంలో బాలాపూర్ లడ్డూ గురించి ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రతిసారి లక్షల్లో ధర పలుకుతూ కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. ఈసారి కూడా తన రికార్డును తానే అధిగమించిన బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షలు పలికింది. అయితే, ఆ రికార్డు కొన్ని గంటలకే బద్ధలైపోయింది. 
 
ఫిలిం నగర్‌లోని వినాయక్ నగర్ బస్తీ వినాయకుడి లడ్డూ రికార్డు స్థాయిలో 17.75 లక్షలు పలికింది. బీజేపీ నాయకుడు గోవర్ధన్ వినాయక్ నగర్ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. గతేడాది వినాయక్ నగర్ లడ్డూ రూ.15.1 లక్షలు పలకగా, బాలాపూర్ లడ్డూ ప్రథమస్థానం దక్కించుకుంది.