బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (11:58 IST)

ప్రేమను తిరస్కరించిందనీ... గొంతుకోసేశాడు... ఎక్కడ?

ఓ యువతి తన ప్రేమను తిరస్కరించిందనీ ఓ ప్రేమోన్మాది బ్లేడుతో గొంతుకోసేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన చున్నీతోనే మెడ బిగించి చంపేశాడు. ఇది హైదరాబాద్‌, యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తాజాగా

ఓ యువతి తన ప్రేమను తిరస్కరించిందనీ ఓ ప్రేమోన్మాది బ్లేడుతో గొంతుకోసేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన చున్నీతోనే మెడ బిగించి చంపేశాడు. ఇది హైదరాబాద్‌, యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే..
 
తూర్పుగోదావరి జిల్లా రావుపాలెంకు చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు తొమ్మిదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. మూడేళ్లుగా జవహర్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమార్తె వెంకటలక్ష్మి(18) రెండు నెలల క్రితం జవహర్‌నగర్‌ ప్రధాన రోడ్డులో ఉన్న జోడీ ష్యాషన్‌ జువెలరీలో షాపులో పనిచేస్తోంది. 
 
కాగా, సోమవారం ఉదయం షాపు యజమానులు దినేశ్‌, జ్యోత్స్నలు ఖమ్మం వెళ్లారు. దీంతో షాపులో వెంకటలక్ష్మి మాత్రమే ఉన్నది. ఆమె ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న మధురానగర్‌కు చెందిన సాగర్‌ అనే యువకుడు మధ్యాహ్నం 1.50 గంటలకు షాపులోకి వచ్చి.. ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఈ విషయాన్ని వెంకటలక్ష్మి యజమానికి ఫోన్‌ చేసి చెప్పింది.
 
మళ్లీ ఓ గంట తర్వాత మద్యం సేవించి మరో ఇద్దరితో కలిసి షాపు వద్దకు వచ్చాడు. మరోసారి వెంకటలక్ష్మిని ప్రేమించాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో కోపోద్రిక్తుడై తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసాడు. తీవ్ర రక్తస్రావంతో వెంకటలక్ష్మి కిందపడి కొట్టుకుంది. ఆమె కొన ఊపిరితో ఉన్నట్టు గమనించిన యువకుడు చున్నీతో మెడ చుట్టు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆమె మరణించినట్టు నిర్ధారించుకున్న తర్వాత షెట్టర్‌ వేసి పారిపోయాడు. దీనిపై షాపు యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సైకో కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.