ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (22:26 IST)

ఏపీ ప్రతి పల్లె తృప్తిగా వుంది... ఆనందంగా వుంది... సీఎం చంద్రబాబు

అమరావతి: గడచిన నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఏ ఊరు వెళ్లినా అత్యంత సంతృప్తిగా ఉందని, ఇది గొప్ప అనుభవం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మా

అమరావతి: గడచిన నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఏ ఊరు వెళ్లినా అత్యంత సంతృప్తిగా ఉందని, ఇది గొప్ప అనుభవం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం తెలియచెప్పేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, వారిలో స్పూర్తి నింపేందుకు నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడు రోజులు అన్ని గ్రామాల్లో ఇవే అంశాలు చర్చించుకున్నట్లు చెప్పారు. దాదాపు 16,355 గ్రామాల్లో గ్రామ నోడల్ అధికారులు, మండల, నియోజకవర్గ సమన్వయ అధికారులు ఈ కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహించినట్లు కొనియాడారు. 
 
ప్రతి రోజూ 30 నుంచి 35 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల పనితీరుని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందినట్లు తెలిపారు. ఈ వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని, గతంలో గ్రామాల్లో ఎండాకాలం అయితే దుమ్ము, వానా కాలం అయితే బురద కనిపించేవని, ఇప్పుడు దుమ్ము ఏమీ లేదని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 17,500 కిలో మీటర్ల  సిమెంట్ రోడ్లు వేశామని వివరించారు. 
 
వీధి లైట్లన్నిటినీ ఎల్ఈడీ బల్బులు అమర్చి చరిత్ర సృష్టించామన్నారు. మరుగుదొడ్ల సమస్య పరిష్కరించామని చెప్పారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా పేదలకు ఇళ్లు, పరిశుభ్రత, ఆరోగ్యం, మంచినీళ్లు, మురుగు కాలువలు, అనేక పనులు చేపట్టి గ్రామాల్లో పెను మార్పులకు నాంది పలికామన్నారు. మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒక మనిషి చనిపోయేంత వరకు జీవిత గమనంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎంతో చక్కగా విశ్లేషించినట్లు తెలిపారు.  సీమంతం, వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, ఆరు వేల రూపాయల నగదు, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ పథకం ద్వారా ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రసవం, తరువాత ఇంటికి చేర్చడం, టీకాలు, అంగన్ వాడీ, పరిశుభ్రత, పచ్చదనం, స్కాలర్ షిప్ లు, విదేశీ విద్య, పెళ్లి కానుక, ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పన, ఇళ్ల నిర్మాణం, పెన్షన్....వంటివి ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో నిరుద్యోగ భృతి కూడా అందిస్తామన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెంచామని తద్వారా రూ.500 కోట్ల వరకు విద్యుత్ అదా అయినట్లు తెలిపారు. చంద్రన్న బీమాతో అయితే అనేక జీవితాలు వెలుగు నింపుకున్నాయన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వచ్చిన రూ.5 లక్షలతో అప్పులు తీర్చుకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నట్లు తెలిపారు. మానవతా కోణంలో ఆలోచిస్తే ఈ విషయంలో తాను సరైన రీతిలో ఆలోచన చేసినట్లు సంతృప్తిగా ఉందన్నారు. 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే ఒక్క ఫిర్యాదు కూడా లేదన్నారు. అవినీతికి తావులేని పాలన అందిస్తున్నట్లు చెప్పారు.  పెన్షన్ దారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ రకమైన పథకాల ద్వారా తనకు గౌరవం పెరిగిందన్నారు. 
 
రుణ మాఫీ చేయడం, విత్తనాలు, ఎరువులు, ఇతర సామాగ్రి ఇబ్బందుల్లేకుండా అందడం, సాయిల్ టెస్ట్ వంటి వాటి ద్వారా వ్యవసాయ ఖర్చు తగ్గి ఆదాయం పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలు అన్నిరకాలుగా ప్రజలకు సేవలందిస్తున్నారని వారిని కొనియాడారు. కళ్యాణ మిత్ర, బీమా మిత్ర, సాధికార మిత్ర వంటి కార్యక్రమాలకు వారు వేరువేరుగా దుస్తులు ధరించి సేవాభావంతో ఎన్నో పనులు చేపడుతున్నారని చెప్పారు. భర్త వదిలివేసిన ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమాజంలోని అందరి అవసరాలను గుర్తించి అన్ని విధాల సహాయపడే పథకాలు అమలు చేస్తున్నట్ల చెప్పారు. సమాజంలో పౌర సేవలు సులభతరం చేసినట్లు తెలిపారు. 
 
ఈ వారం రోజులు తాను వెళ్లే దారిలో కొందరితో మాట్లాడానని, కొందరి ఇళ్లకు వెళ్లి, లబ్దిదారులతో మాట్లాడానని, నేరుగా వారిని అడిగి పొందిన లబ్ది గురించి తెలుసుకున్నానని చెప్పారు. ప్రతి కుటుంబానికి బాధ్యత గల పెద్దగా పని చేశానని, వారి ఆదాయం పెరిగిందని, వారిలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపిస్తోందన్నారు. సంతృప్తి స్థాయితో అంతకు ముందు ఏడాది దేశం 122వ స్థానంలో ఉంటే, రాష్ట్రం 72వ స్థానంలో ఉందని, గత ఏడాది దేశం 133వ స్థానానికి దిగజారితే, రాష్ట్రం 44 స్థానానికి ఎగబాకిందని వివరించారు. రాష్ట్రంలో ఓడిఎఫ్ పూర్తి చేసి, ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ కు వెళ్లినట్లు తెలిపారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
 
పోలవరం అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ పూర్తి
 
పోలవరం డయాఫ్రం వాల్ పూర్తి అయిందని, దీంతో  ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ పూర్తి అయిందని సీఎం చెప్పారు. రెండు సీజన్లలో దీనిని పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక వర్షాలు, వరదలు వచ్చినా పనులు ఆగవన్నారు. సోమవారం తాను పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళుతున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడి తగ్గించినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చెందుతోందని, అక్కడ చెరువులలో నీళ్లు చేరాయని, అంతకంటే ఆనందం ఏంకావాలని అన్నారు. అక్కడ కొండలపై కూడా చెట్లు కనపడుతున్నాయని, వాతావరణంలో కూడా మార్పు వచ్చినట్ల తెలిపారు. అడ్డంకులన్నిటినీ అదిగమించుతూ ముందుకు వెళ్లుతున్నట్లు చెప్పారు. బిజేబీతో కలిసినా, విబేధించినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. మనకు జరిగిన అన్యాయానికి ప్రత్యేక హాదా ఇచ్చినా తక్కువేనన్నారు. 
 
అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్య,జెఈఈ, నీట్ లలో మనమే నెంబర్ వన్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు తీరు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.  ప్రభుత్వ యంత్రాంగం పని తీరుని ప్రశంసించారు. అత్యధిక మంది బాగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలలో సంతృప్తి 73 శాతం నుంచి 77 శాతానికి పెరిగినట్లు తెలిపారు. పేదవారి కోసం, సమాజం కోసం సంపద సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవర్, గ్యాస్, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణం, శుభ్రత, నీటి భద్రత వంటి సంక్షేమ కార్యక్రమాలు బిగ్గెస్ట్ హిట్ గా, తనకు అత్యంత సంతృప్తినిచ్చినవిగా భావిస్తున్నట్ల చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోని గ్రామాలు అన్ని విధాలా చాలా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అవసరమైతే నాలుగు ఇతర రాష్ట్రాలలోని గ్రామాలను పరిశీలించి, అక్కడ అభివృద్ధిని అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోని ఓ నాలుగు గ్రామాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి చూడాలని, ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో మీకే తెలుస్తుందని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.