శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:34 IST)

నేరుగా నేనే వ‌చ్చి స‌మస్య‌ ప‌రిష్క‌రిస్తా: చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే

"ఓ రైత‌న్నా.. జీవితంలో నువ్వు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటావ్‌.. ఈ క‌రోనా విప‌త్తు నీకో లెక్కా..? అయినా మ‌నం భ‌య‌ప‌డాల్సిందేమీ లేదు. రైతు బాంధ‌వుడు వైఎస్ జ‌గ‌న‌న్న మ‌న‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. మ‌న‌కు ఏ క‌ష్టం రానివ్వ‌రు" అంటూ చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని రైతుల్లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపారు.

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల అన్న‌దాత‌లు, రైతు కూలీలు ప‌లు ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని నాదెండ్ల శివార్ల‌లోని మిర్చి పొలాన్ని గురువారం ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. పొలంలోకి వెళ్లి, రైతులు, కూలీల‌తో మ‌మేక‌మ‌య్యారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క‌రోనా మ‌హమ్మారిని జ‌యించాలంటే అనేక‌ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని చెప్పారు. పొలాల‌కు వ‌చ్చేట‌ప్పుడు, పొలంలో ప‌నిచేసేట‌ప్పుడు భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. ఇరుకు ఆటోల్లో పొలాల‌కు రావ‌ద్ద‌ని, ఒక్కో ట్రాక్ట‌ర్‌లో ఏడుగురు, ఎనిమిది మంది చొప్పున భౌతిక దూరం పాటిస్తూ చేల‌కు రావాల‌ని కోరారు.
 
కోల్డుస్టోరేజీ యాజ‌మాన్యాలు ఇబ్బంది పెడితే నాకు చెప్పండి
రైతులు మాట్లాడుతూ మిర్చి పంట‌ను అమ్ముకోలేకపోతున్నామ‌ని, లాక్‌డౌన్ వ‌ల్ల వ్యాపారాలు జ‌ర‌గ‌డం లేద‌ని, ధ‌ర కూడా ప‌డిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. శీత‌ల గిడ్డంగుల్లో స‌రుకు దాచుకుందామంటే ఇబ్బందులు వాటిల్లుతున్నాయ‌ని వాపోయారు.

గిడ్డంగుల్లో ఖాళీ లేద‌ని చెబుతున్నార‌ని, ఒక్కో టిక్కీకి రూ.200కుపైగా వ‌సూలు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా నేరుగా త‌న‌కు చెప్పాల‌ని కోరారు.

శీత‌ల‌గిడ్డంగుల్లో ఖాళీ లేద‌ని ఎవ‌రైనా అన్నా, అధిక ధ‌ర‌లు వ‌సూలు చేస్తున్నా.. త‌న దృష్టికి తీసుకురావాల‌ని, నేరుగా తానే వ‌చ్చి స‌మస్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని హామీ ఇచ్చారు. మిర్చి రైతు ధ‌ర కోసం దిగులుప‌డాల్సిన ప‌నిలేద‌ని, కొద్ది రోజులు ఓపిక ప‌డితే చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని ధ‌ర ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

అంత‌గా ఇబ్బంది అయితే నేరుగా ప్ర‌భుత్వ‌మే పంట‌ను కొనుగోలు చేస్తుంద‌ని చెప్పారు. స‌మ‌స్య‌ను తాను సీఎం దృష్టికి తీసుకెళ‌తాన‌ని హామీ ఇచ్చారు. రైతులు తొంద‌ర‌ప‌డి పంట‌ను త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంటే రైతు ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టంచేశారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాదెండ్ల మండ‌ల అధ్య‌క్షుడు శ్రీనివాస‌రెడ్డి, నాదెండ్ల మండ‌లం నుంచి జెడ్పీటీసీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న కాట్ర‌గ‌డ్డ మ‌స్తాన్‌రావు, పార్టీ నాయ‌కులు ఉన్నారు.