బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2024 (22:33 IST)

ఆ పని చేస్తే ముద్రగడ పద్మనాభంను ఏపీ సీఎం చేస్తా: కె.ఎ పాల్

ka paul
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీలో చేరి పోటీ చేస్తే ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముద్రగడను ప్రకటిస్తానంటూ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసారు. కె.ఎ పాల్ మాట్లాడిన వివరాలు ఇలా వున్నాయి.
 
'' ముద్రగడ పద్మనాభం గారూ.. మీరు వైసిపిలో చేరబోతున్నట్లు కాపు నాయకులు చెప్పారు. వాస్తవానికి వైసిపి అవినీతి ఆకాశాన్నంటిపోయింది. కొండలు, గుట్టలు, పుట్టలు అన్నీ అమ్మేసారు. చివరికి రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టారు. 200 దేశాల్లో, 29 రాష్ట్రాల్లో ఎవరైనా ప్రభుత్వ సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారా?
 
జగన్ చేసిన పనికి ఏపీ ప్రజల ఒక్కో కుటుంబం నెత్తిన రూ. 5 కోట్లు అప్పు వుంది. అలాంటి పార్టీలో ముద్రగడ చేరితే చరిత్రహీనులు అయిపోరా. ఒక్కసారి డా.బి.ఆర్ అంబేద్కర్ గురించి చూడండి. ఆయన మానవ హక్కుల కోసం, మంత్రి పదవిని కాళ్లతో తన్నేసారు. బడుగు బలహీన వర్గాల కోసం నిలబడి మహనీయులయ్యారు. అందుకే మీరు మా ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీకంటే సీనియర్ అయిన బాబూ మోహన్ మా పార్టీలో చేరారు.
 
1400 సినిమాల్లో నటించినవారు మీ ఇంటికి రాబోతున్నారు. మా పార్టీలో చేరాల్సిందిగా మిమ్మల్ని అడుగుతారు. ఒకవేళ మీరు మా పార్టీలో చేరనట్లయితే మీరు రూ. 50 కోట్లకు, 100 కోట్లకు వైసిపికి అమ్ముడుపోయారని అంటున్నారు. మీరు ఒకవేళ వైసిపిలో చేరితే ఈ ప్రచారం వాస్తవమని నమ్మాల్సి వస్తుంది. అందుకే మా పార్టీలో చేరి ఉత్తరాంధ్రలో విజయ ఢంకా మోగించండి. మనకు కనీసం 50 సీట్లు వస్తే ముద్రగడ పద్మనాభం మీరే ఏపీ ముఖ్యమంత్రి. ఈ వీడియో ముద్రగడకి చేరేవరకూ అందరూ షేర్ చేస్తుండండి'' అంటూ చెప్పుకొచ్చారు.