శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 22 జులై 2021 (21:03 IST)

రాజ‌ధాని విశాఖ అయితే... ఇక్క‌డ ఇళ్ళ‌తొల‌గింపు ఎందుకు?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సెక్యూరిటీ నెపంతో తాడేపల్లిలో పేద‌ల ఇళ్లు తొల‌గించ‌డం స‌రికాద‌ని సీపీఎం నాయ‌కుడు రామ‌కృష్ణ విమ‌ర్శించారు. ఆయ‌న క‌ర‌క‌ట్ట‌పై పేద‌ల ఇళ్ల సంద‌ర్శ‌న‌కు వెళ్ళ‌డంతో సీఎం నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. కరకట్ట వెంబడి ఉన్న అమరా రెడ్డి నగర్ కాలనీ నిర్వాసితులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  ప‌రామ‌ర్శించారు.

దీనితో నిర్వాసితులు ఉన్న ప్రదేశాలు వెళ్లేందుకు అనుమతి లేదని రామకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ నేత రామకృష్ణకు పోలీసులకు మధ్య వాగ్వాదం జ‌రిగింది. రాజధానిని ఇక్కడ ఉండటం లేదు... నేను విశాఖపట్నం వెళ్లిపోతున్నాఅంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు... అలాంటపుడు సెక్యురిటి నెపంతో పేదల ఇళ్లు ఎందుకు తొలిగిస్తున్నార‌ని రామ‌కృష్ణ ప్ర‌శించారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు సెక్యూరిటీ ఎందుకు గుర్తు రాలేదు అని ప్ర‌శ్నించారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, నిర్వసితులకు ప్రతి ఒక్కరికి ఇళ్ళు స్థలాలు కేటాయించి కొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అపుడే క‌ర‌క‌ట్ట‌ను ఖాళీ చేయించాల‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.