తమిళనాడుకు తుఫాను ముప్పు... ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారుతుందని, ఈ కారణంగా తమిళనాడు రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, తమిళనాడుకు తుఫాను ముప్పు పొంచివుందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా మారుతుందని, జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రభావం కారణంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీచేసింది.
అలాగే, తమిళనాడులోని 19 జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.