దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు: ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర
రానున్న రోజుల్లోమధ్యభారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుజయ మహాపాత్ర వెల్లడించారు. గత నెలలో వర్షాలు మొహం చాటేశాయి. అయితే, సెప్టెంబరు మొదటి వారంలోనే వర్షాలు కురవడం మొదలవుతాయని చెప్పారు. అరేబియా, బంగాళాఖాతం సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారినట్టు వెల్లడించారు. సెప్టెంబరు నెలలో సగటు వర్షపాతానికి 9 శాతం అటుఇటుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఎల్‌నినో ప్రభావం కారణంగా గత నెలలో మొహం చాటేసిన వానలు ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్‌లో ఈ వారం వానలు కురుస్తాయని మహాపాత్ర గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 'జూలైలో అధిక వర్షాల తర్వాత ఆగస్టులో చాలా వరకూ రుతుపవనాలు మొహంచాటేశాయి. నెలలో 20 రోజుల పాటు ఎక్కడా చినుకుపడలేదు. ఎల్‌నినో పరిస్థితులే దీనికి కారణం.
అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కారణంగా ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం ప్రారంభమైంది. దీంతోపాటూ తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది' అని ఆయన తెలిపారు.