కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు సమయంలో పిఠాపురంతో పాటు కాకినాడ సిటీ వంటి మరికొన్ని స్థానాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించరు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదికను తయారు చేసి అందచేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో పిఠాపురం, కాకినాడ నగరంలో హింస చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కౌంటింగ్‌కు ముందు, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నివేదికను దృష్టిలో ఉంచుకుని కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట తదితర సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నిఘా పెట్టింది. 2019 ఎన్నికల్లోనూ ఇటీవలి పోలింగ్ సందర్భంగా గొడవలకు దిగిన, ప్రేరేపించిన వ్యక్తుల వివరాలను సేకరించి వారిపై పోలీసులు నిఘా ఉంచారు. అలాగే, ఈ ప్రాంతాల్లో కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎప్, ఏపీపీఎస్సీ, సివిల్ పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైకాపా తరపున వంగా గీత పోటీ చేయగా, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.