శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (22:56 IST)

అప్పులు చేయటమే గాంధీజీ సిద్ధాంతమా?: చంద్రబాబు

గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ తపిస్తే రాష్ట్రంలో గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
 
మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే... "టీడీపీ ప్రభుత్వ హయాంలో చెత్త నుండి సంపద సృష్టికి అడుగులు పడితే నేడు చెత్తపై కూడా పన్నులు వేసే స్థాయికి దిగజారారు. మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తామని మహిళలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పారు.

పేదల పొట్టకొట్టి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడం గాంధీజీ ఆశయమా.? రాబోయే15 ఏళ్ల పాటు  వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టిమరీ అప్పు చేయడం గాంధీజీ విధానమా? సొంత కల్తీబ్రాండ్లతో జనం ప్రాణాలను తీయడం గాంధీజీ సిద్ధాంతమా.?

మద్య నిషేధమని హామీనిచ్చి నేడు రాష్ట్రాన్ని మద్యాంద్రప్రదేశ్ గా మార్చడం గాంధీజీ కలలుగన్న రాజ్యమా? మద్యాన్ని ఏరులై పారిస్తూ కుటుంబాలను బజారుకీడిస్తూ మహిళల్ని మోసగించడమే గాంధీజీ సిద్దాంతమా?  

గాంధీ జయంతి సందర్భంగా  ఎన్నికల హామీ మేరకు మద్య నిషేధానికి చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. వాక్ ఇన్ స్టాల్స్ పేరుతో ‘‘అందరికీ అందుబాటులో మద్యం షాపులు‘’ శ్రీకారం చుట్టడం ప్రజల్ని మోసం చేయడం కాదా.?

టీడీపీ హయాంలో బెల్టు షాపులను  పూర్తిగా రద్దు చేస్తే జగన్ వచ్చి వాటి స్థానంలో ఊరూరా సారాబట్టీలు తీసుకొచ్చాడు. వీధివీధినా బెల్ట్ దుకాణాలు పెట్టాడు. ప్రజలకు గాలిమాటలు చెప్తూ మద్యం ఆదాయాన్ని గతంకంటే 75 శాతం పెంచాడు.

కరోనా సమయంలోనూ మద్యం షాపుల దగ్గర పోలీసులను, ఉపాధ్యాయులను కాపలా పెట్టి మద్యం విక్రయించిన చరిత్ర జగన రెడ్డికే దక్కుతుంది. ఒక్క ఏడాదిలోనే 1.25 కోట్ల లీటర్ల నాటు సారా పట్టుబడింది అంటే.. దొరకని నాటుసారా ఇంక ఎంత వుందో అర్థమవుతోంది.

వీళ్లే తయారుచేసి, వీళ్లే బ్రాండ్లు సృష్టించి, వీళ్లే రేట్లు నిర్ణయిస్తారు. రూ.20కే తయారైన మద్యం సీసాను రూ.200లకు అమ్ముతూ ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25వేల కోట్లు జే.ట్యాక్స్ దోచుకుంటున్నారు.

మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని డ్రగ్గాంధ్రప్రదేశ్ గా మార్చారు.  రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడి చేసి యువతను మత్తుకు బానిసను చేసి యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. 

దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. అర్థరాత్రి కూడా స్త్రీ స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాంతంత్ర్యం వస్తుందని గాంధీజీ అన్నారు.

కానీ జగన్ పాలనలో పట్టపగలే భర్తతో ఉన్న మహిళలకు కూడా రక్షణలేకుండా పోయింది. అక్రమార్జన కోసం డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కవడం వల్లే నేడు రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, హింసాకాండకు అదుపులేకుండా పోయింది. 

అహింసతో ప్రజల  హృదయాలను  జయించిన మహాత్ముడే దేశానికి  స్పూర్తి . గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకుందాం ... గాంధీజీ కలలు గన్న దేశాన్ని నిర్మించుకుందాం."