శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (20:17 IST)

ప్రకాశం బ్యారేజీ సురక్షితమేనా?

ప్రకాశం బ్యారేజీ భద్రతపై సందేహాలు వస్తున్నాయి. బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. అయితే వరద నీరు వచ్చినప్పుడు ఐదు రోజుల క్రితం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ ఉంచడంతో బ్యారేజీ భద్రత ఎంత నే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వరదల సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలి. అంతకు మించి నిల్వను ఎక్కువ రోజులు చేస్తే ఆ ప్రభావం బ్యారేజీ పై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. బ్యారేజీ వద్ద గరిష్ఠంగా 12 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తూ అంతకుమించి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు.

వరద 12 అడుగులు దాటి, 3.97 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 15 అడుగులు దాటి 5.69 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 5 లక్షల క్యూసెక్కులకు మించి వరదనీటిని దిగువకు విడుదల చేస్తే చాలా గ్రామాలకు ముంపు ముప్పు ఏర్పడుతుంది. 11.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను తట్టుకునేలా బ్యారేజీని నిర్మించారు.

2009లో బ్యారేజీకి భారీస్థాయిలో వరద వచ్చి, 11.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. వరదల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని మాత్రమే నిర్వహించాలి. సామర్థ్యానికి మించిన నీటిని నిల్వ చేయడం దీని భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని నిపుణులు అంటున్నారు. బ్యారేజీ బలహీనపడి 2009 నాటి స్థాయిలో వరద వస్తే తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని స్పష్టం చేస్తున్నారు.

1979లో గుజరాత్‌లో మోర్బీ డ్యాం విధ్వంసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ‘సామర్థ్యానికి మించి వరద రావడంతో డ్యాం కొట్టుకుపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇలాంటివి జరుగుతాయి. కానీ మానవ తప్పిదాల వల్ల జరగడం అరుదు’ అని ఓ రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు తెలిపారు.

దేశవ్యాప్తంగా 348 డ్యాముల భద్రతపై కాగ్‌ సందేహాలు వ్యక్తం చేసింది. వీటి భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పనితీరు ఆశాజనకంగా లేదని తప్పుబట్టింది.
 
విజయవాడ వద్ద కృష్ణానదిపై సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ పర్యవేక్షణలో 1852లో తొలి ఆనకట్ట ఊపిరి పోసుకుంది. ఇది 1854లో పూరైంది. 1,132 మీటర్ల పొడవున 4మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. అయితే 1952లో వచ్చిన వరదలకు ఇది కొట్టుకుపోయింది. దీనికి ఎగువన 1954లో కొత్త ఆనకట్ట నిర్మాణం ప్రారంభించి 1957నాటికి పూర్తి చేశారు.

అదే ఏడాది డిసెంబరు 24నుంచి దానిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బ్యారేజీపై 24అడుగుల వెడల్పుతో రోడ్డు, ఇరువైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి ఏర్పాటు చేశారు. అయితే కృష్ణానది నీటిని కేవలం దారి మళ్లించడానికి మాత్రమే దీన్ని నిర్మించారు. నీటిని నిల్వ చేయడం దీని ఉద్దేశం కాదు. అలాంటి బ్యారేజీ వద్ద సామర్థ్యానికి మించి నీరు నిల్వ చేయడం సరైన నిర్ణయం కాదని విశ్రాంత ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.
 
1903లో తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి అతిపెద్ద వరద వచ్చింది. ఆ ఏడాది అక్టోబరులో వచ్చిన వరదతో బ్యారేజీ నీటిమట్టం 23.50 అడుగులకు చేరింది. రోజుకు 10,60,830 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత 2009లో బ్యారేజీ చరిత్రలోనే రికార్డు స్థాయి వరద నమోదైంది. ఆ ఏడాది అక్టోబరు 5న వచ్చిన వరదతో బ్యారేజీ నీటిమట్టం 23.75 అడుగులకు చేరింది.

రోజుకు 10,94,422 క్యూసెక్కుల నీటిని 36గంటల పాటు దిగువకు విడుదల చేశారు. సరాసరిన రోజుకు 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లేది. అక్టోబరు 5న గరిష్ఠంగా బ్యారేజీ వద్ద 11.10లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 11.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను తట్టుకునేలా బ్యారేజీని నిర్మించారు.

అప్పటికి పులిచింతల ప్రాజెక్టు నిర్మించలేదు. ఎగువ నుంచి అధిక పరిమాణంలో నీరు వస్తున్నందున నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో పెరిగిపోవడంతో మొత్తం 70 గేట్లు 23అడుగుల వరకు ఎత్తారు. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి సీతానగరం వరకు నదిపై ఉన్న రైల్వేవంతెనను తాకే స్థాయి వరకు నీటి ప్రవాహం కొనసాగింది.

ప్రవాహానికి, వంతెనకు మధ్య అడుగు మాత్రమే ఖాళీ ఉంది. ఒకానొక దశలో రైల్వేవంతెన పైనుంచే నీరు ప్రవహిస్తుందని అధికారులు ఆందోళన చెందారు. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. ప్రవాహం ఉధృతికి బ్యారేజీలోనూ స్వల్ప కదలికలొచ్చాయి. ఐదారు గేట్లు ఊగిపోయాయి. 2009 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆగస్టు 12న వచ్చిన వరద ఉధృతితో 8లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటి దిగువకు వదిలారు.