ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (16:09 IST)

ఉద్యోగాలే లేకుండా జీతాలు ఇచ్చిన వైకాపా సర్కారు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి...

call money
గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం సాగించిన అనేక అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. వైకాపా కోసం పని చేసిన కొన్ని వేల మందికి ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో జీతాలు అందజేశారు. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో ఈ-ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైకాపా అనుకూలంగా పని చేసే వ్యక్తులు, ఉద్యోగులుగా చోటు సంపాదించారు. వీరిలో చాలా మంది అసలు ఆఫీసుకే వెళ్లలేదు. అయినా ఠంచనుంగా వైకాపా సర్కారు వీరికి జీతాలు చెల్లించింది. 
 
వారంతా వైకాపా సోషల్‌ మీడియా కోసం పనిచేస్తూ కాలం గడిపారు. కొన్ని చోట్ల అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో కార్పొరేషన్‌ నుంచి జీతాలు స్వాహా చేసినట్లు సమాచారం. సొమ్ము దోచిపెట్టేందుకు జగన్‌ సర్కారు ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపుల వివరాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలను సేకరిస్తోంది. పలు శాఖల్లో పొరుగుసేవల పేరిట జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహిస్తోంది.