రంగంపేటలో తమిళ సంప్రదాయ క్రీడా పోటీలు... ఎలా?
పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు సాహస క్రీడా పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తమిళ సంప్రదాయ క్రీడా పోటీలుగా పరిగణిస్తారు. అందుకే ప్రతియేటా సంక్రాంతి సంబరాలకు జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా, జల్లికట్టు పోటీలకు మదురై జిల్లా పెట్టింది పేరు. ఈ క్రీడా పోటీలు క్రమంగా తమిళనాడు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశఅ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఈ జిల్లాలో పెక్కుమంది తమిళం మాట్లాడటంతో పాటు, తమిళ సంప్రదాయాలను ఆచరిస్తుంటారు. దీంతో ఈ జిల్లాల్లో ఈ జల్లికట్టు పోటీలను ప్రతియేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. అయితే, ఈ పోటీల నిర్వహణపై పోలీసులు ఆది నుంచి ఆంక్షలు విధిస్తూనే ఉంటారు. జిల్లికట్టు నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. పోలీసుల ఆంక్షల మధ్యే ఈ పోటీలను నిర్వహిస్తుంటారు.
తాజాగా, ఈ సంక్రాంతి వేడుకలు అంగ రంగ వైభవంగా సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమతో పాటు ముక్కనుమను కూడా కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగల వేళ సాంప్రదాయ పోటీలైన కోడి పందాలు, జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో జల్లికట్టు పోటీలు కలర్‌ఫుల్‌గా సాగాయి. ఈ పోటీలు తమిళనాడు జల్లికట్టు పోటీల తరహాలో ఉండకపోయినప్పటికీ... పోటీలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపించడం గమనార్హం.
సినీ, రాజకీయ ఫోటోలతో గిత్తలను అందంగా అలంకరించారు. రంకెలు వేస్తూ పరిగెత్తతున్న గిత్తలను పట్టుకునే ప్రయత్నంలో కొంత మంది యువకులు గాయపడ్డారు. పోటీలు ముగిశాక ఓ ఎద్దు జనం మీద పడింది. దాని వీరంగం ధాటికి అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. పోలీసుల ఆంక్షల మధ్యే జల్లికట్టు పోటీలు నిర్వహించారు. నిర్వహణపై పోలీసులు మొదటినుంచి ఆంక్షలు విధిస్తూ వచ్చారు. కానీ అవేవీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే జల్లికట్టు పోటీలు నిర్వహించారు. హెచ్చరికలు ఖాతరు చేయకుండా పోటీలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.