10 నుంచి వారాహి యాత్ర.. విశాఖలో రచ్చ చేయనున్న పవన్
తనకు నానా అడ్డంకులు సృష్టించిన విశాఖపట్టణంలోని వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. తాను చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా, మూడో దశ యాత్ర ఈ నెల 10వ తేదీన ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం వెల్లడించారు.
వారాహి యాత్ర ఏర్పాట్లపై విశాఖ జిల్లా నాయకులతో ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్రను మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలన్నారు.
నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. యాత్రలో భాగంగా విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. విశాఖలో భూకబ్జాలు, పర్యావరణం ధ్వంసమైన ప్రాంతాలను క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా వివిధ వర్గాల ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని వివరించారు. ఈనెల 19 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.